
40views
ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే క్రతువు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో వరి సాగును భక్తులు ప్రారంభించారు. భద్రాచలం రాముల వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరి విత్తనాలను కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో గ్రామానికి తీసుకొచ్చారు. శ్రీరాముడు, ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో రామనామ సంకీర్తనలతో పొలాన్ని నాగలితో దున్నుతూ సాగును ప్రారంభించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ.. ఏటా కోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నామని, ఇక్కడ పండిన ధాన్యాన్ని వివిధ ప్రాంతాల్లోని భక్తులకు అందించి గోటితో ఒలిపించి.. భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలకు పంపిస్తున్నామన్నారు.





