News

అయోధ్య ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

14views

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. తాత్కాలిక సారథిని నియమించింది. దీంతోపాటు కొత్తగా ట్రస్టుకు సీఈవోను నియమించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం అయోధ్యలో ట్రస్టు సమావేశం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో సాయంత్రం   3.30 గంటలకు ప్రారంభమైన సమావేశం 3 గంటలపాటు కొనసాగింది.

దీనికి 9 మంది శాశ్వత సభ్యుల్లో ఏడుగురు హాజరయ్యారు. ట్రస్టు ఛైర్మన్‌ నృత్య గోపాల్‌ దాస్‌ వచ్చారు. చంపత్‌ రాయ్, అనిల్‌ మిశ్ర హాజరుకాలేదు. అనంతరం కోశాధికారి గోవింద్‌ గిరి వివరాలను వెల్లడించారు. చంపత్‌ రాయ్‌తోపాటు ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్ర రాజీనామాలను ఆమోదించామని తెలిపారు. కృష్ణ మోహన్‌కు అదనంగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించామని వివరించారు. ‘విరాళాల దుర్వినియోగంపై చంపత్‌ రాయ్‌ తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. నిందితులు దొరికి వారికి శిక్ష పడే వరకూ తనకు మనశ్శాంతి ఉండదని ఆయన చెప్పారు’ అని తెలిపారు. తదుపరి ట్రస్టు సమావేశాన్ని ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. అప్పటికల్లా సిట్‌ తుది నివేదిక అందనుందని తెలిపారు.

ఎవరీ కృష్ణ మోహన్‌?

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన కృష్ణ మోహన్‌ ట్రస్టు శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. ఆరెస్సెస్‌ సీనియర్‌ సభ్యుడు, ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌ మాజీ అధికారి అయిన ఆయన 2025 సెప్టెంబరులో శాశ్వత సభ్యుడిగా చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఆయన గతంలో అణు శక్తి విభాగంలోనూ సేవలందించారు. ఆ తర్వాత మహారాష్ట్ర క్యాడర్‌ ఐఎఫ్‌ఎస్‌గా పని చేశారు.