
కేరళ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానానికి సంబంధించిన ఎంతో విలువైన శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాలుకేరళ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్కైవ్స్ నుంచి మాయమయ్యాయి. తిరువనంతపురంలోని మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో భద్రపరిచిన ఈ అరుదైన పత్రాలు అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
కేరళ విశ్వవిద్యాలయ సేకరణలో కనిపించకుండా పోయిన తాళపత్ర గ్రంథాలలో చాలా వరకు పాత కులీన కుటుంబాల (అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్) సభ్యులు విరాళంగా ఇచ్చినవి ఉన్నాయి. వారు తరతరాలుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఈ అరుదైన పత్రాలను పరిశోధనల కోసం విశ్వవిద్యాలయానికి అందజేశారు. అయితే వీటి అదృశ్యంపై వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ తనిఖీలు నిర్వహించినప్పటికీ, అవి ఎక్కడికి పోయాయనేది గానీ, ఎలా మాయమయ్యాయనేది గానీ తేల్చలేకపోయారు.
ప్రస్తుతం ఈ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ కేవలం తాత్కాలిక సిబ్బందితోనే నడుస్తోంది. అంతేకాకుండా ఇక్కడున్న అత్యంత విలువైన చారిత్రక సంపదపై గత 14 సంవత్సరాలుగా ఎలాంటి ఆడిట్ (సరిచూసే ప్రక్రియ) జరగలేదనే షాకింగ్ నిజం బయటపడింది. ఇదే సమయంలో కేరళలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి కూడా ఇలాగే తాళపత్ర గ్రంథాలు మాయమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి.
ప్రాచీన విజ్ఞాన వ్యవస్థలు, చారిత్రక సంఘటనలకు సంబంధించిన అమూల్యమైన సమాచారం ఉన్న ఈ తాళపత్ర గ్రంథాలు దేశం దాటిపోయి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి ఉండే డిమాండ్ కారణంగా వీటిని విదేశాలకు స్మగ్లింగ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మాయమైన తాళపత్ర గ్రంథాలను గుర్తించడానికి, అదృశ్యమైన వాటిని వెలికితీయడానికి తక్షణమే సమగ్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ‘సేవ్ యూనివర్సిటీ క్యాంపెయిన్ కమిటీ’ రెండు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లకు వినతిపత్రం సమర్పించింది





