
దిల్లీ అల్లర్ల కేసు 2020లో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్ షర్జీల్ ఇమామ్‌కు దిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు గుర్తుచేసింది. అసలు వీరి బెయిల్ దరఖాస్తులు కూడా విచారణకు యోగ్యమైనవి కాదని.. అందువల్లే వాటిని కొట్టివేస్తున్నామని వెల్లడించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్లలో దాదాపు 53 మంది మృతి చెందగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం Unlawful Activities (Prevention) Act (UAPA) కింద ఛార్జిషీట్ నమోదు చేశారు. అనంతరం ఐదుగురు నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖాలిద్, ఇమామ్‌కు మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.





