News

శాకాహార నగరంగా మారే దిశగా వారణాసి కీలక నిర్ణయం

5views

వారణాసి: సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన కాశీ (వారణాసి) త్వరలో శాకాహార నగరంగా మారనుంది. నగర పవిత్రత, పరిశుభ్రత పరిరక్షణ లక్ష్యంగా వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నగర పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను శివారు ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం నగరంలోని సుమారు 350 నుంచి 400 మాంసం దుకాణాలను రానున్న ఆరు నెలల్లో విడతల వారీగా, దీపావళి నాటికి నగర శివార్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్‌నగర్‌, సుజాబాద్‌, గణేశ్‌పూర్‌, అవలేష్‌నగర్‌, శివపూర్‌ ప్రాంతాల్లో వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ చర్య అమలైతే కాశీ దేశంలో రెండో శాకాహార నగరంగా గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం గుజరాత్‌లోని పాలితానా మాత్రమే పూర్తి శాకాహార పట్టణంగా గుర్తింపు పొందింది. అక్కడ 2014 నుంచే మాంసం, చేపలు, గుడ్ల విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ క్షేత్రానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర ఆధ్యాత్మిక స్వరూపాన్ని మరింత బలోపేతం చేయడం, పవిత్రతను కాపాడడం లక్ష్యంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.