News

అమర్‌నాథ్ యాత్రపై పటిష్ఠ నిఘా

23views

జులై 3న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రాజెక్ట్ హాక్ ఐ’ అనే సమగ్ర నిఘా, భద్రతా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. యాత్రా మార్గంలో నిరంతర నిఘా ఉంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమం కింద పోలీసులు అధునాతన సాంకేతికతను వ్యూహాత్మక మానవ వనరుల మోహరింపుతో అనుసంధానిస్తారు. ఈ మేరకు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

“గగనతల నిఘా కోసం కీలక ప్రదేశాలలో ఐదు డ్రోన్ బృందాలను మోహరిస్తాం. అవి రియల్ టైమ్ పర్యవేక్షణతో పాటు పరిస్థితిపై మెరుగైన అవగాహనను అందిస్తాయి. ఈ గగనతల నిఘా వ్యవస్థ తలెత్తే ఏ విపత్కర పరిస్థితినైనా త్వరగా అంచనా వేయడానికి, భద్రతా దళాలు సత్వరమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. క్షేత్రస్థాయిలో అప్రమత్తతను పెంచడానికి ఎత్తైన పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, సమర్థవంతమైన ప్రతిస్పందన సంసిద్ధతను నిర్ధారించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన 22 స్నైపర్ బృందాలను కూడా నిర్దేశిత పాయింట్ల వద్ద మోహరించాం. యాత్ర మార్గంలోని కీలక ప్రదేశాలలో 416 హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాం” అని పోలీస్ అధికారి తెలిపారు.

పోలీసుల రిహార్సల్
అమర్‌నాథ్ యాత్ర సన్నద్ధతను అంచనా వేసేందుకు జమ్ముకశ్మీర్‌లోని సాంబాలో పోలీసులు సమగ్ర భద్రతా రిహార్సల్ నిర్వహించారు. ఈ రిహార్సల్ సందర్భంగా హైవే నాకా పాయింట్ల వద్ద అత్యంత అప్రమత్తత, కార్యాచరణ సంసిద్ధతను పాటించాల్సిన అవసరాన్ని ఉన్నతాధికారులు తెలియజేశారు. యాత్ర సమయంలో తలెత్తే ఎలాంటి భద్రతా సవాళ్లకైనా అప్రమత్తంగా, చురుకుగా స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు.