
ఏలూరు జిల్లా పెదపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల విత్తనాలు, విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు.ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇన్‌చార్జి ఎన్‌ఎఫ్‌ఏ నవీన రైతులకు విత్తన గుళికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తగా విత్తన గుళికల తయారీ చేపట్టాలని సూచించారు. నవధాన్యాల విత్తనాలను గుళికల రూపంలో తయారు చేసి పొలాల్లో వెదజల్లడం ద్వారా అవి సుమారు ఆరు నెలల వరకు సురక్షితంగా నిల్వ ఉండటంతో పాటు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మెరుగైన మొలకలను అందిస్తాయని వివరించారు.
రైతుల సమక్షంలో విత్తన గుళికల తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించి, అనంతరం రైతులతో కలిసి గుళికలను పొలంలో వెదజల్లారు. నవధాన్యాల సాగు భూసారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు.





