News

​సామాజిక, సాంస్కృతిక కేంద్రాలుగా ఆలయాలు

9views

రాష్ట్రంలో రెండేళ్లలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖను సమగ్రంగా ప్రక్షాళన చేసి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక చర్యలు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆలయాల అభివృద్ధి, వేద పండితుల సంక్షేమం, ఆలయ భూముల పరిరక్షణ, ఉద్యోగాల భర్తీ, 2027 గోదావరి పుష్కరాల సన్నాహాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు.

చిన్న ఆలయాలు, వేద పండితులకు ప్రాధాన్యం
రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం కలిగిన చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాల నిర్వహణ కోసం నిధులు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,137 ఆలయాల అర్చకుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా నేరుగా నిధులు జమ చేస్తున్నామన్నారు. వేద, సంస్కృత విద్యను అభ్యసించిన పండితుల గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచడం ద్వారా 188 మంది వేద పండితులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.

ఆలయాల భద్రతకు ప్రత్యేక కమిటీలు
దేవాలయాల భద్రత, ఆలయ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో డీజీపీ, దేవాదాయ కమిషనర్ నేతృత్వంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ఉత్సవాలు, పూజా కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాలకు సంబంధించిన నిర్ణయాల్లో వైదిక పండితులకే ప్రాధాన్యం కల్పించామని చెప్పారు.

ఆలయ భూముల సంరక్షణకు చర్యలు
రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో 21,672 ఆలయాలు, 4.48 లక్షల ఎకరాల ఆస్తులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆలయ ఆస్తుల పరిరక్షణతో పాటు, భూముల వివాదాల పరిష్కారానికి చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

2027 గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు.

162 ఆలయాల పునర్నిర్మాణం
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 162 ఆలయాల పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రూ.71.60 కోట్లతో చేపట్టిన ఈ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. “గ్రీన్ పుష్కరాలు” కాన్సెప్ట్‌తో పర్యావరణహిత ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుధ్య పర్యవేక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. దీని ఫలితంగా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు.

ఆలయ ఆదాయం, భక్తుల సంఖ్యలో వృద్ధి
రాష్ట్రంలోని ప్రధాన 22 ఆలయాల వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగిందని, సంవత్సరానికి కోట్లాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. ప్రముఖ ఆలయ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

సామాజిక చైతన్య కేంద్రాలుగా ఆలయాలు
ఆలయాలను కేవలం పూజా స్థలాలుగానే కాకుండా సామాజిక, సాంస్కృతిక చైతన్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అక్షరాభ్యాసం, యోగా, ధ్యానం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను ఆలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.