News

ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకుల హత్యకు కుట్ర

61views

తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుదీర్ఘకాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్‌ అలీ ఎలియాస్‌ షేక్‌ మన్సూర్‌ ఎలియాస్‌ విజయ్‌కుమార్, షేక్‌ అమానుల్లా ఎలియాస్‌ అబూబకర్‌ సిద్ధిఖీలు దేశంలోని ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ద్వారా భారత్‌లో ‘షరియా’ చట్టం అమలు చేయాలనేది వీరి ఎజెండా అని తెలిపింది.

ఈ కేసులో ప్రధాన కుట్రదారైన అమానుల్లా.. మహమ్మద్‌ అలీకి ఉగ్రవాద భావజాలం నూరిపోసి, అతణ్ని తన ముఠాలో నియమించుకున్నాడని పేర్కొంది. బాంబుల తయారీపై అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడని చెప్పింది. అమానుల్లా తయారు చేసిన అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలను ఎవరికీ అనుమానం రాకుండా రాయచోటిలోని రహస్య ప్రాంతానికి తరలించటంలో మహమ్మద్‌ అలీదే కీలకపాత్రని స్పష్టం చేసింది. ఈ మేరకు అలీపై విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో శుక్రవారం అభియోగపత్రం దాఖలు చేసింది. అమనుల్లా పాత్రపై ఫిబ్రవరిలోనే ఛార్జిషీట్‌ వేసింది. తాజా అభియోగపత్రంలో ప్రధానాంశాలివి.

  • 1999లో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులైన మహమ్మద్‌ అలీ, షేక్‌ అమనుల్లాలు దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవటానికి అన్నమయ్య జిల్లా రాయచోటికి వచ్చేశారు.
  • మహమ్మద్‌ అలీ తన పేరును షేక్‌ మన్సూర్‌గా, అమనుల్లా తన పేరును అబూబకర్‌ సిద్దీఖీగా మార్చుకుని.. ఆ మారుపేర్లతో గుర్తింపు పత్రాలూ పొందారు. స్థానికంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అందరితో కలిసిపోయి దుస్తుల వ్యాపారం నిర్వహించేవారు.
  • రహస్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేవారు. భారీ పేలుళ్లకు కుట్ర పన్ని రాయచోటిలోని ఓ రహస్య స్థావరంలో పేలుడు పదార్థాలు నిల్వ చేశారు. దీన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం (సీఐ సెల్‌) అధికారులు గతేడాది జులైలో వీరిని పట్టుకున్నారు.
  • స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. తర్వాత దర్యాప్తు ఎన్‌ఐఏ చేతుల్లోకి వెళ్లింది. సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఈ కేసులో షేక్‌ అమనుల్లా, మహమ్మద్‌ అలీతో పాటు మరొకర్ని అరెస్టు చేసింది.