News

హల్దీఘాటి యుద్ధం నాగరికతా పోరాటంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం

35views

హల్దీఘాటి యుద్ధం భారత్ పక్షాన పోరాడిన వారికి విజయాన్ని అందించిన యుద్ధమని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హల్దీఘాటి యుద్ధం యొక్క 450వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయ్‌పూర్‌లోని గాంధీ మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ…”ఈ చర్చ తరచుగా వ్యతిరేక దిశలో సాగుతుంటుంది, కానీ వాస్తవాలు మాత్రం వేరేలా చెబుతున్నాయి,” అని ఆయన అన్నారు. హల్దీఘాటి యుద్ధం కేవలం ఒక సైనిక పోరాటం మాత్రమే కాదు. “విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా భారతదేశం సాగించిన సుదీర్ఘ నాగరికతా పోరాటంలో ఇది ఒక నిర్ణయాత్మక ఘట్టం అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా మొఘల్ చరిత్రకారులు రాసిన వాటిని కూడా భాగవత్ ఉటంకించారు. మొదటి దాడి తర్వాతే వారు తమ స్థానాన్ని వదిలి ఆరు నుండి ఏడు మైళ్ల దూరం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని వారు నమోదు చేశారు. అప్పుడు అది ఎవరి విజయం?” అని ఆయన పేర్కొన్నారు.

రెండవ దాడిలో ఒక ప్రముఖ మొఘల్ సేనాని తన గుర్రంతో సహా హతమయ్యాడని, అలాగే చేతక్ శత్రు సేనాని ఏనుగుపై తన ముందు కాళ్లను ఉంచిందని డాక్టర్ భగవత్ గుర్తుచేశారు. యుద్ధం తర్వాత మొఘల్ దళాలు గోగుండాకు వెనక్కి తగ్గి, కోట గోడల రక్షణలో తలదాచుకున్నాయని, బయటకు రావడానికి సాహసించలేదని ఆయన పేర్కొన్నారు.

“వారి వద్ద ఆహారం అయిపోయినప్పుడు, వారు పచ్చి మామిడికాయలతోనూ, చివరికి తమ సొంత గుర్రాల మాంసాన్ని తినడం ద్వారానూ బతికారు; అయినా సరే, వారు కోట బయటకు రాలేదు. అప్పుడు, విజేత ఎవరు?” అని ప్రశ్నించారు.

1857 నాటి స్వాతంత్ర్య పోరాట యోధుడు బాబూ కున్వర్ సింగ్‌ను ఉదహరిస్తూ, డాక్టర్ భగవత్ ఒక విషయాన్ని ప్రస్తావించారు: కున్వర్ సింగ్ చివరికి జగదీష్‌పూర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ తన పాలనను పునరుద్ధరించినప్పటికీ, బ్రిటిష్ నివేదికలు మాత్రం ఆయన పారిపోయారని తరచుగా పేర్కొనేవని అన్నారు.అప్పట్లో చరిత్రకారులు అటువంటి కథనాలను సృష్టించారు, ఇప్పటికీ అలాగే కొనసాగుతోందన్నారు.

మహారాణా ప్రతాప్‌ను అణచివేసే లక్ష్యంతోనే మేవార్‌పై ఆ దండయాత్రను చేపట్టారని ఆయన అన్నారు. “ఒక భారీ సామ్రాజ్య సైన్యం మేవార్‌పైకి దూకింది, కానీ ఫలితం ఏమైంది? చెప్పుకోదగ్గ విజయం ఏదీ సాధించకుండానే వారు వెనుదిరిగారు, పైగా మేవార్ ప్రజలు వారిపై మట్టి గడ్డలు విసిరి కొట్టారు. అటువంటి సైన్యం విజయం సాధించామని చెప్పుకోగలదా?” అని అన్నారు.