News

వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చనున్న కొత్త క్రూజ్‌ క్షిపణి

3views

భూతల లక్ష్యాలపై దాడి చేసే దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణి (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం) భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని తోమహాక్‌ క్షిపణితో పోలుస్తున్నారు. సుదూర లేదా పటిష్ఠమైన లక్ష్యాల్ని ఛేదించాలనుకున్నప్పుడు అగ్రరాజ్యం ఎక్కువగా తోమహాక్‌లను రంగంలోకి దింపుతుంది.

సోమవారం ఒడిశా తీరానికి చేరువలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి జరిగిన ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం క్షిపణి పరీక్ష విజయవంతమైన సంగతి తెలిసిందే. దీని పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించకపోయినప్పటికీ ఈ అస్త్రం పరిధి 1,000 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. గతంలో ఎన్నో వైఫల్యాలు చవిచూసిన నిర్భయ్‌ క్షిపణి ప్రాజెక్టుకు ఇది మరింత ఆధునిక వెర్షన్‌ అని తెలుస్తోంది.

సాధారణంగా బాలిస్టిక్‌ క్షిపణులు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి నుంచి కింద ఉన్న శత్రువులపైకి దూసుకొస్తాయి. ఆలోపు వాటిని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం వంటి క్రూజ్‌ క్షిపణుల సాంకేతికత భిన్నంగా ఉంటుంది. నేల లేదా సముద్ర మట్టానికి అత్యంత చేరువలో ప్రయాణించడం వల్ల శత్రుదేశాల రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించడం దాదాపుగా అసాధ్యం. తోమహాక్‌ తరహాలోనే భారత్‌కు చెందిన ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం కూడా మార్గమధ్యంలో అడ్డంకుల్ని తప్పించుకుంటూ, శత్రు స్థావరాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరుకునే సామర్థ్యాల్ని కలిగి ఉందని చెబుతున్నారు. 1983లో అమెరికా నౌకాదళంలో చేరిన తోమహాక్‌.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్రూజ్‌ క్షిపణుల్లో ఒకటిగా చెబుతుంటారు. 1991 నాటి గల్ఫ్‌ యుద్దం నుంచి ఇటీవల ఇరాన్‌పై దాడుల వరకు దాదాపుగా ప్రతి యుద్ధంలోనూ దీనిని అగ్రరాజ్యం వినియోగిస్తూ వస్తోంది.

చైనా, పాక్‌లో ఆ నగరాలు..
పాకిస్థాన్‌ సరిహద్దుకు చేరువలో ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎంను మోహరిస్తే ఆ అస్త్రం పరిధిలోకి ఇస్లామాబాద్, రావల్పిండి (పాక్‌ సైనిక ప్రధాన కేంద్రం), లాహోర్, ఫైసలాబాద్, కరాచీ వంటి నగరాలు వస్తాయి. ఈ క్షిపణి చైనాకూ హెచ్చరికలు పంపిస్తోంది. ఆ దేశ సరిహద్దు ప్రాంతాల్లో దీనిని మోహరిస్తే అక్కడి సైనిక, పాలనాపరంగా కీలకమైన లాసా, చెంగ్డు, కున్మింగ్, ఉరుమ్కీ వంటి ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

అత్యంత వేగవంతమైన క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌.. భారత్‌ అమ్ములపొదిలో ఉంది. సుదీర్ఘ కాలం యుద్ధం చేయాల్సి వస్తే ఇదొక్కటే చాలదు. ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం.. బ్రహ్మోస్‌కు సరైన జోడీగా కనిపిస్తోంది. బ్రహ్మోస్‌తో పోలిస్తే ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం ధర చాలా తక్కువ. అందువల్ల దీర్ఘకాలం పోరాడటానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అస్త్రం.. భారత సైన్యంలో చేరడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.