News

దేశంలోని అడవుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది : సుప్రీంకోర్టు

5views

దేశంలోని అడవుల్ని రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో స్వర్గతుల్యమైన అడవులు, సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా కాపాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ వి. మోహనలతో కూడుకున్న ధర్మాసనం స్పష్టం చేసింది. రక్షిత అడవుల సరిహద్దులకు ఒక కిలోమీటరు దూరం వరకూ రాళ్ల తవ్వకాలు, స్టోన్‌ క్రషర్ల ఏర్పాటుకు సమ్మతి తెలపరాదని ఝార్ఖండ్‌ హైకోర్టు గత జనవరిలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాళ్ల తవ్వకాలు, క్రషింగ్‌ యూనిట్లు అటవీ ప్రాంతానికి, అటవీ భూములకు కనీస దూరం నిబంధనను స్థానిక కాలుష్య నియంత్రణ మండలి సవరించింది. అడవి సరిహద్దులకూ ఆ యూనిట్లకూ మధ్య దూరాన్ని 250 మీటర్లకు తగ్గించింది. దీనిపై స్పందించిన హైకోర్టు అడవికి కిలోమీటరు దూరం వరకూ రాళ్ల తవ్వకాలు, క్రషింగ్‌ యూనిట్లకు అనుమతి ఇవ్వరాదని ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది.