
దేశంలోని యువతపై ఆరెస్సెస్ ఎంతో ఆశాభావంతో వుందని, నేటి యువత తమ సంప్రదాయాలతోనూ, భారతదేశపు ఘనమైన చరిత్రతోనూ అనుసంధానమై ఉన్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. పుణె శ్రామిక్ పాత్రకార్ సంఘ్ శతవత్సర వేడుకల సందర్భంగా నవీ పేఠ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సునీల్ అంబేకర్ పాల్గొన్నారు.
సంఘ్ రిజిస్ట్రేషన్ , ‘జెన్ జెడ్’ (Gen Z), జనాభా అసమతుల్యత సమస్య మరియు ముస్లిం సమాజం పట్ల సంఘ్ దృక్పథం వంటి అంశాలపై సునీల్ అంబేకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన ఉద్యమానికి సంబంధించిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఇలా అన్నారు: “భారతదేశంలో అన్ని స్థాయిలలోనూ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయి. మన న్యాయస్థానాలు, యంత్రాంగం మరియు మీడియా పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తున్నాయి. ఇంతటి పటిష్టమైన ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ గళాన్ని వినిపిస్తే, ఆ విషయాన్ని శ్రద్ధగా విని, తగిన విధంగా పరిగణనలోకి తీసుకునే సామర్థ్యం వ్యవస్థకు ఉండాలి. కాబట్టి, ఇటువంటి ఉద్యమాల పట్ల ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.” అని అన్నారు.
సంఘ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి కొందరు రాజకీయ నేతలు సృష్టిస్తున్న గందరగోళాన్ని తోసిపుచ్చారు.సంఘ్ చట్టబద్ధమైన ఉనికికి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన వివాదమూ లేదు; స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు దురుద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారు.” అని పేర్కొన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్తిగా చట్టబద్ధమైన మరియు గుర్తింపు పొందిన ఒక సామాజిక సంస్థ. అందుకే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వివిధ జాతీయ విపత్తుల సమయంలోనూ, నిర్మాణాత్మక కార్యక్రమాలలోనూ ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సంఘ్ యొక్క క్రియాశీల సహకారాన్ని కోరుతూ వచ్చాయని గుర్తు చేశారు.
సంఘ్ పథ సంచలన్ విషయంలో నిబంధనల ప్రకారం యంత్రాంగం నుంచి అనుమతి లభించిందని, అంతేకాకుండా తమ శాఖల పేర్లతో అధికారికంగా బ్యాంక్ ఖాతాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే సంఘ ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా పారదర్శకంగా వుంటాయని, కేవలం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరుగుతాయన్నారు.తన దైనందిన ‘శాఖ’ వ్యవస్థ ద్వారా, సంఘం ప్రతిరోజూ సమాజానికి ప్రత్యక్షంగా జవాబుదారీగా ఉంటుందన్నారు.
ముస్లిం సమాజం మరియు సంఘ్ మధ్య ఉన్న పరస్పర సంబంధం గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: “సంఘ్ స్థాపనకు చాలా కాలం ముందు నుండే—వేర్పాటువాద ధోరణి కారణంగా—దేశంలో హిందూ-ముస్లిం ఘర్షణలు ఉన్నాయన్నది చారిత్రక వాస్తవం.’’ అని పేర్కొన్నారు.సామాజిక సంస్కరణల కోసం సానుకూల చొరవలు ఇప్పుడు ముస్లిం సమాజం నుండే ప్రారంభం కావడం సంతృప్తికరమైన విషయమని అన్నారు.





