News

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో గాయత్రీ మంత్రం తప్పనిసరి

10views

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ సాంస్కృతిక విలువలను విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు ప్రతిరోజూ గాయత్రీ మంత్రం మరియు ఇతర సంప్రదాయ ప్రార్థనలను పఠించడాన్ని తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారుల సమాచారం ప్రకారం, ఈ నెల 12న జారీ చేసిన ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయం, భోజనానికి ముందు, అలాగే ఇతర నిర్దిష్ట సందర్భాల్లో సంప్రదాయ ప్రార్థనలు నిర్వహించనున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వం ఈ చర్యను భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించే ప్రయత్నంగా పేర్కొంటోంది. గాయత్రీ మంత్రం వంటి వేద మంత్రాలు ఏ ఒక్క మతానికే పరిమితం కాకుండా సనాతన భారతీయ జ్ఞాన సంపదకు ప్రతీకలుగా భావించబడుతున్నాయని పలువురు విద్యావేత్తలు, సాంస్కృతిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే ఈ నిర్ణయంపై ఎప్పటిలానే ప్రతిపక్ష భారత జాతీయ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ నేత సుశిల్ ఆనంద్ శుక్ల మాట్లాడుతూ, ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి భావనలను విద్యార్థుల్లో పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిందూ సంఘాలు, సాంస్కృతిక సంస్థలు స్వాగతిస్తున్నాయి. పాఠశాల విద్యతో పాటు విలువల ఆధారిత విద్య కూడా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొంటున్నారు.