
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూన్ 16న విజయవాడలోని మ్యానర్ ఫుడ్ ప్లాజా హోటల్లో నిర్వహించబడింది. ఈ సమావేశం ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గారి మార్గదర్శనంలో, రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు గారి అధ్యక్షతన జరిగింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో గత ఏడాది గణేష్ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు.
అదేవిధంగా, రాబోయే గణేష్ ఉత్సవాలు మరింత విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో ముందస్తుగా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండపాల అనుమతులు, నమోదులను సులభతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని, అలాగే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి నరసింహం, మాజీ ఐపీఎస్ అధికారి బి.వి. రమణ కుమార్, ప్రముఖులు విజయ ఆదిత్య, తనికెళ్ల సత్య రవికుమార్ పాల్గొని గణేష్ ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన ధార్మిక విలువలు, సామాజిక సద్భావన, పర్యావరణ పరిరక్షణ, యువత పాత్ర వంటి అంశాలపై మార్గదర్శనం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్, రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్ రాజుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాలను భక్తి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ సమన్వయంతో నిర్వహించాలనే సంకల్పంతో రాష్ట్ర సమితి ముందుకు సాగుతున్నట్లు సమావేశంలో నాయకులు పేర్కొన్నారు.





