
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రక్తపాతం సృష్టించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పన్నిన వినాశకరమైన కుట్రను భారత భద్రతా దళాలు బయటపెట్టాయి. ఢిల్లీలోని ఓ చారిత్రాత్మక దేవాలయం, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే హర్యానాలోని ముర్తాల్ ధాబాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా నిఘా వర్గాల నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా ఢిల్లీ-చండీగఢ్ హైవేపై ఉండి, వేల సంఖ్యలో ప్రజలు సందర్శించే ముర్తాల్‌లోని ప్రసిద్ధ ధాబాలను కూడా టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ నేరుగా ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. స్లీపర్ సెల్స్‌కు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు మరియు నిధులు సమకూర్చడంలో ఐఎస్ఐ కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. రాజధానిలోని రద్దీ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. భారత్‌లో అశాంతిని నెలకొల్పేందుకు దాయాది చేస్తున్న కుఠిన ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు నిరంతరం నిఘాను కొనసాగిస్తున్నాయి.





