ఉరుకుల పరుగుల జీవితంలో తమ పనిని తాము చేసుకోవడానికే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఓ ఇద్దరు పర్యావరణ ప్రేమికులు రోడ్డుకు ఇరువైపున, డివైడర్ల మధ్య ఉన్న ఎండిపోయిన మొక్కలకు నీరు పోస్తూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. వీరు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని దిల్లీ ప్రజలు అభినందిస్తున్నారు. “ప్లాంట్ అంబులెన్స్” పేరుతో వినూత్న కార్యక్రమం ద్వారా రోడ్డు డివైడర్లపై వాడిపోతున్న మొక్కలకు నీరు పోసి, నగరంలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. గౌరవ్ దత్, మనోజ్ కుమార్ ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్నారు.
2020లో ప్లాంట్ అంబులెన్స్
గౌరవ్ దత్ 2012లో తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక ఎండిపోతున్న పార్కులో పచ్చదనం పెంచడం ద్వారా ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత రోడ్ల పక్కన, ట్రాఫిక్ డివైడర్ల వద్ద ఉన్న మొక్కల సంరక్షణ కోసం ముందుకు వచ్చారు. 2020లో ‘ప్లాంట్ అంబులెన్స్’ను అధికారికంగా ప్రారంభించారు. విద్యుత్‌తో నడిచే లోడర్ వాహనం ద్వారా మొక్కలకు నీరు పోస్తూ పచ్చదనాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే దిల్లీ వ్యాప్తంగా 7-8 కిలోమీటర్ల రోడ్డు డివైడర్లలో పచ్చదనాన్ని పెంపొందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.
రోడ్డు డివైడర్‌పై మొక్కలు వాడిపోతుండటం చూసి
దిల్లీ ప్రభుత్వ పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మనోజ్, ఒకరోజు తన ఇంటికి సమీపంలో ఉన్న రోడ్డు డివైడర్‌పై మొక్కలు వాడిపోతుండటం చూశారు. ఆ దృశ్యం ఆయనను కలచివేసింది. భార్యతో కలిసి టూవీలర్‌పై రెండు బకెట్ల నీరు తీసుకెళ్లి మొక్కలకు నీరు పోశారు. తర్వాత ప్లాంట్ అంబులెన్స్ టీమ్ చేసే పని చూసి స్ఫూర్తి పొంది వారితో పాటు కలిశారు. ఇలా గౌరవ్ దత్, మనోజ్ కుమార్ పచ్చదనాన్ని పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మనోజ్ దత్ గత ఐదారు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
సంకల్పం ఉంటే మార్గం
ఫైనాన్స్ విభాగంలో సీనియర్ మేనేజర్ అయిన గౌరవ్ దత్ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ధ్యానం చేసి, మొక్కల నీరు పోయడానికి బయలుదేరతారు. ఉద్యోగం, కుటుంబం, సామాజిక సేవను సమన్వయం చేసుకుంటూ పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. సంకల్పం ఉంటే మార్గం తప్పక దొరుకుతుందని ఆయన అన్నారు. వీరు పచ్చదనం పెంపొందించిన ప్రాంతాల్లో మొదట విపరీతమైన దుమ్ము, వేడి ఉండేవి. దీని వల్ల కొందరు ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ప్లాంట్ అంబులెన్స్ సభ్యులు చేపట్టిన పచ్చదనం కార్యక్రమం ద్వారా కాలుష్యం తగ్గి అక్కడి పరిసరాలు చాలా పరిశుభ్రంగా మారాయి. కరోనా మహమ్మారి సమయంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత్య ముఖ్యమైందని మాకు అర్థమైందని గౌరవ్ దత్, మనోజ్ కుమార్ చెప్పారు.
పచ్చదనం పెంచేలా కృషి
పిల్లలు, వృద్ధులు మొక్కలను సంరక్షించడం చూసి గౌరవ్ దత్ కళ్లు చెమర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పచ్చదనం పెంచేలా కృషి చేయాలని ప్లాంట్ అంబులెన్స్ సభ్యులు కోరారు. వారి కోరిక మేరకు ప్రస్తుతం చిన్న పిల్లలతో సహా వందలాది మంది ఈ కార్యక్రమంలో చేరుతున్నారు. ప్లాంట్ అంబులెన్స్ కేవలం మొక్కలకు నీరు పోయడానికి మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ తమ వంతుగా చిన్న సహాయం చేస్తే నగరాలు మళ్లీ పచ్చగా, స్వచ్ఛంగా మారాతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా విస్తరించాలని, మరింత మంది ఇందులో చేరాలని వారు ఆకాంక్షిస్తున్నారు.




