
మనిషి పుట్టుకతో కులమతాలను ఎంచుకోలేడు కానీ, తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించే గుణాన్ని మాత్రం తప్పక ఎంచుకోగలడు. అది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. రక్తం రంగు ఒకటే, ప్రాణం విలువ ఒకటే అయినప్పుడు మనుషుల మధ్య కులమతాల అడ్డుగోడలెందుకు? విభేదాలను సృష్టించే శక్తులకన్నా ప్రేమను పంచే మనసులే ఈ ప్రపంచానికి అవసరం. మానవత్వం అనే అనంతమైన ఆకాశం కింద అందరం స్వేచ్ఛగా, ప్రేమతో బతకడమే నిజమైన నాగరికత.
భారతీయ సంస్కృతి ఎప్పుడూ విశ్వజనీనతకే ప్రాధాన్యమిచ్చింది. మన ప్రాచీన గ్రంథాలు మనుషుల మధ్య విభజనను కాక ఏకత్వాన్ని బోధించాయి. మహోపనిషత్తులో ‘అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్। ఉదారచరితానాం తు వసుధైక కుటుంబకమ్’ అన్న రుషి వాక్కులు అందరికీ శిరోధార్యమైనవి. వీడు నావాడు, వాడు పరాయివాడు అని ఆలోచించడం అల్పబుద్ధిగలవారి లక్షణం. విశాల హృదయం ఉన్నవారికి ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. రుగ్వేదంలోని సంజ్ఞాన సూక్తం బోధించినట్టుగా ‘సమానో మంత్రః సమితిః సమానీ’- మన ఆలోచనలూ, మన లక్ష్యం, మన హృదయ స్పందన ఒకటే కావాలి. ఇక్కడ ఎక్కడా విడివిడి వర్గాల ప్రస్తావన లేదు, కేవలం మానవ సమూహం అనే భావనే ఉంది.
మానవత్వం కన్నా ఏదీ గొప్పది కాదు అన్నది కేవలం ఒక మాట మాత్రమే కాదు, అదొక గొప్ప జీవన సూత్రం. నిస్వార్థం, సమానత్వం, సహానుభూతి మిళితమైనదే మానవత్వం. ఎదుటివారికి సాయపడటం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, హోదాను బట్టి కాక వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం, వారి బాధను మన బాధగా భావించి స్పందించడం లాంటివన్నీ మానవత్వపు చిహ్నాలే. వాటిని సంపాదించే ప్రయత్నం చేయాలి. సంపద, అధికారం ఎప్పుడైనా పోవచ్చు. కానీ మనం ఒక వ్యక్తిపట్ల చూపించిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ వారి గుండెల్లో నిలిచిపోతాయి. అది మనకు ప్రశాంతతనిచ్చి విద్వేషం వల్ల కలిగే అశాంతిని తొలగిస్తుంది.
అద్వైత వేదాంతం ప్రకారం, ప్రతి ప్రాణిలో ఉండే ఆత్మ ఒక్కటే. శరీరం, కులం, మతం అనేవి కేవలం బాహ్యమైన పొరలు మాత్రమే. లోపలి చైతన్యం అందరిలోనూ సమానమేనని శంకరాచార్యులు మనీషా పంచకంలో వివరించారు. మానవత్వమనేది మనిషి సహజ లక్షణం. మనిషికి మతం అవసరమే కానీ, తోటి మనిషిని ప్రేమించలేనప్పుడు ఆ మతానికి అర్థం లేదని స్వామి వివేకానంద స్పష్టంగా చెప్పారు. ఆకలితో ఉన్నవాడికి మతం కన్నా అన్నం ముఖ్యమైనట్టు, మనిషికి కులం కన్నా మానవత్వమే ఉన్నతమైనదవుతుంది. మతం మనిషిని దైవం వైపు నడిపించే మార్గం కావాలి కానీ, మనుషుల్ని విడదీసే సాధనం కాకూడదు. మానవ సేవయే మాధవ సేవ అన్న నినాదాన్ని నిజం చేయడమే మానవత్వం కలిగిన మనుషుల కర్తవ్యం.





