
‘అంతర్జాతీయ యోగా డే’ పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ విషయమై తొలి సన్నాహాక సమావేశం రాష వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన విజయవాడలోని ఆయుష్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ప్రాధాన్యంపట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, యోగా, రోటరీ, లయన్స్ క్లబ్, ఇతర సమాజ సేవా సంస్థల వారిని భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న యోగా ట్రైనర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి కార్యక్రమాల నిర్వహణపై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. గతేడాది నిర్వహించిన కార్యక్రమాలకు కొనసాగింపుగా తదుపరి చర్యలు ఉండాలని పేర్కొన్నారు. అమరావతి పరిధిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు అధ్యక్షతన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల నేతృత్వంలో యోగా డే కార్యక్రమాలు ఉండాలన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ రెండో వారం నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభమవుతాయని తెలిపారు. వీరిలో యోగాసనాలపట్ల అవగాహన పెంచడం వల్ల విస్తృత ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ చర్యలు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కూడా దోహదoచేస్తాయన్నారు
గత ఏడాది యోగా డే కార్యక్రమాల ప్రభావంపై ఆరా..!
మండల స్థాయి నుంచి యోగాసన కార్యక్రమాలు జరపాలని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు . గత ఏడాది అంతర్జాతీయ యోగా డే సందర్భంగా భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలు, వాటి ప్రభావం గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై నివేదిక కూడా సిద్ధం చేయాలని ఆయుష్ ఇంచార్జ్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణను ఆదేశించారు. ప్రకృతి రంగ నిపుణులు, యోగా అండ్ నేచురోపతి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సమావేశంలో మాట్లాడుతూ, యోగాసనాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు చర్యలపై పలు ముఖ్యమైన సూచనలు చేశారు. యోగా డే కార్యక్రమాల నిర్వహణపై మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ త్వరలోనే మరో మారు అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుతో కూడా యోగా డే కార్యక్రమాల నిర్వహణపై మంత్రి చర్చించనున్నారు.





