ArticlesNews

దైవాన్ని మించినవారు

8views

పురాణాల్లో పుండరీకుడి కథ ఎంతో ఆసక్తికరమైంది, ప్రేరణ కలిగించేది. ఆయన్నలా మలచిన మహా జ్ఞాని కుక్కుటముని. ఆతడు ఎంతో మహిమాన్వితుడని, రూపు మారిన గంగ, యమున, సరస్వతి నదులను సౌందర్యవతులుగా మార్చాడని చెప్పే జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక కథను అనుసరించి.. పుండరీకుడు తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి భార్యతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఒకసారి అతడు కాశీక్షేత్రానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో కుక్కుటముని ఆశ్రమం కనిపించగా.. లోపలికి వెళ్లి ‘స్వామీ, కాశీకి దారి తెలియజేయగలరా?’ అనడిగాడు మహర్షిని. అందుకు కుక్కుటముని తానెన్నడూ కాశీ వెళ్లలేదని, తల్లిదండ్రులను సేవించడమే అసలైన తీర్థయాత్రగా భావిస్తున్నానని చెప్పాడు. జన్మనిచ్చిన అమ్మానాన్నల కంటే లోకంలో మరెవరూ ఎక్కువ కాదని, వారి సేవలో తరించే సంతానానికే అత్యున్నత స్థానం దక్కుతుందంటూ అనేక ఉదాహరణలతో కుక్కుటముని వివరించాడు. ఆ ప్రబోధాత్మక విషయాలన్నీ పుండరీకుడికి మస్తిష్కంలో నాటుకున్నాయి. అతడికి జ్ఞానోదయమైంది. చేసిన తప్పు తెలిసొచ్చింది. ఇక పుండరీకుడు కాశీకి వెళ్లలేదు. వెనుతిరిగి ఇంటికెళ్లాడు. తల్లిదండ్రుల సేవకే అంకితమై.. కంటికి రెప్పలా చూసుకున్నాడు పుండరీకుడు. సదా వారికి శుశ్రూష చేస్తూ మహా భక్తుడిగా మారాడు. విఠోబా భక్తుడిగా ప్రసిద్ధిచెందాడు. కుక్కుటముని ప్రబోధలతో పరివర్తన చెందిన పుండరీకుడు మహా భక్తుడిగా మారాడు.

ఒకరోజు శ్రీకృష్ణుడు వచ్చి పుండరీకుణ్ణి పలకరించాడు. తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్న పుండరీకుడు ఒక ఇటుకను ఆసనంగా చూపించి.. కొంతసేపు అక్కడ కూర్చోమని సూచించాడు. పని పూర్తయిన తర్వాతే కృష్ణుడి వద్దకు వస్తానన్నాడు. పుండరీకుడు తండ్రి పాదాలను ఒత్తుతుంటే.. శ్రీకృష్ణుడు అతడు చూపిన ఇటుక మీదే కూర్చుని.. నడుముపై చేతులు పెట్టుకుని (కటి హస్తంతో) వేచి ఉన్నాడు. కన్నవారి పట్ల పుండరీకుడి భక్తిశ్రద్ధలకు కృష్ణుడు ముగ్ధుడై నిజరూపంలో దర్శనమిచ్చాడు. అప్పుడతడు కృష్ణుడికి భక్తిగా నమస్కరించి.. ‘భూలోకంలోనే ఉండి, భక్తులను అనుగ్రహించు స్వామీ’ అంటూ ప్రార్థించాడు పుండరీకుడు. కృష్ణుడు ‘తథాస్తు’ అంటూ పుండరీకుడి కోరిక నెరవేర్చాడు. ఆ ప్రాంతమే పండరిపురం. అక్కడ కొలువైన విగ్రహమే పాండురంగడు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని, నిజానికి దైవాన్ని మించినవారని, ఆ సంగతి భగవంతుడు కూడా అంగీకరించాడని తెలియజేస్తుందీ కథ.