
శబరిమల కేసు విచారణలో భాగం సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. విగ్రహం కేవలం వస్తువు కాదు.. హిందూ ధర్మంలో విగ్రహం అనేది కేవలం మట్టి లేదా రాయి కాదు, అది నిర్దిష్ట లక్షణాలు కలిగిన ‘సజీవ దైవం’ అని పిటీషనర్ తరపు సీనియర్ న్యాయవాది వివి గిరి తన వాదన వినిపించారు. దేవాలయంలో ప్రతిష్టించిన విగ్రహానికి చట్టపరమైన వ్యక్తిత్వం ఉంటుందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయన వివరణ ఇచ్చారు.
శబరిమల అయ్యప్పస్వామి ‘నైష్ఠిక బ్రహ్మచారి’ రూపంలో ఉంటారని.. ఆ స్వామి ప్రత్యేక లక్షణాలను గౌరవించడం ఆరాధనలో భాగమేనని పేర్కొన్నారు. ప్రతి దేవాలయానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆరాధనా పద్ధతితోపాటు సంప్రదాయం ఉంటుందని వివరించారు. వాటిని మార్చడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనానికి గుర్తు చేశారు. గుడికి వెళ్ళేది దైవంపై నమ్మకాన్ని చాటుకోవడానికి.. అంతేకానీ అక్కడి దైవ లక్షణాలను లేదా సంప్రదాయాలను ప్రశ్నించడానికి కాదని వి.వి. గిరి తన వాదనలు వినిపించారు.
అలాగే మతపరమైన హక్కులు, ఆచారాల పరిధిపై రాజ్యాంగ ధర్మాసనం ముందు వి.వి.గిరి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఒక వ్యక్తి తన మతాన్ని అనుసరించాలనుకున్నప్పుడు, ఆ ఆలయ సంప్రదాయాలకు లోబడి ఉండాలని సీనియర్ అడ్వకేట్ వి వి గిరి స్పష్టం చేశారు. రాజ్యాంగ నైతికత కంటే మతపరమైన విశ్వాసాలు, ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా వి వి గిరి అభిప్రాయపడ్డారు.





