ArticlesNews

స్వరాజ్య సమర చైతన్యదీప్తి కాసుల పురుషోత్తమ కవి

31views

దక్షిణ భారతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన టిప్ప్పు సుల్తాన్ 4వ మైసూర్ యుద్ధంలో మరణించాడు. దానితో దక్షిణ భారతాన్ని బ్రిటిష్ వారు వెల్లస్లీ ఆధ్వర్యంలో సైన్య సహకార పద్ధతికి ఒప్పించారు. దానిలో భాగంగా హైదరాబాద్‌లోని బ్రిటిష్ రాజప్రతినిధి పాట్రిక్ నిజాం ఆలీఖాన్‌తో సైనిక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ కారణంగా ఏటా బ్రిటన్‌కు రూ.24 లక్షలు ఇవ్వడానికి సైన్యానికి అయ్యే ఖర్చులు భరించడానికి ఒప్పించాడు. అందువల్ల సంస్థానాల సొమ్ములన్నీ బ్రిటిష్ వారికే దక్కాయి.

దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు కరవ య్యాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం క్షేత్రంలో ఆంధ్ర శ్రీ మహావిష్ణు దేవాలయం ఎంతో పేరు ప్రఖ్యాతులున్న దేవళం. ఆ స్వామిని కూడా పూర్తిగా పస్తు పెట్టారు. దీనిని చూసిన కాసుల పురుషోత్తమ కవికి కోపం వచ్చింది. దేవుడికి ఉత్సవాలు లేక వెలవెల పోతున్న వైనం చూసి కవి గారి మనస్సు కలత చెందింది. ఆ బాధను ఎవరి ముందు వెళ్లగక్కితే ఎవరు ఊరుకుంటారు. అందుకే ఆ తిట్టేదేదో ఆయన్నే (భగవంతుని) తిడదాం అని ప్రారంభిం చారు. అందుకు వ్యాజస్తుతి అలంకారం బాగా అక్కరకు వచ్చింది.

ఇది తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. చారిత్రక పౌరాణికాది అనేక నేపథ్యాలు తెలిస్తే గాని అర్థం కాదు. దీనికి తోడు ఈ శతకానికి ఒక చారిత్రక ఆవశ్యకతా ఉంది. “చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావహత విమత జీవ, శ్రీకాకుళాంధ్ర దేవ!” అని మకుటముతో ఈ శతకాన్ని రాశాడు కవి.

ఆలు నిర్వాహకురాలు భూదేవియై యఖిల భారకుడను ఖ్యాతి దెచ్చె /నిష్ట సంపన్నురాలిందర భార్యయై కామితార్థుడన్న ఘనత దెచ్చె

కమల గర్భుండు సృష్టికర్త తనూజుడై బహుకు టుంబీకుడన్న ప్రతిభదెచ్చె /ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిలే / మొదటి నుండియు నీవు దామోదరుడవె

(26వ పద్యము)

నీకంటూ స్వయంప్రతిభ లేకనే గదా నీవు నీ ఇల్లాండ్రు మీద, సంతానం మీద ఆధారపడవలసి వచ్చెను. భూదేవి నీ భార్య అగుట వలన అఖిల భారకుడని, లక్క్ష్మి నీ భార్య అగుట చేత అష్టైశ్వర్య ములకు నిలయుడవని, బ్రహ్మ కొడుకు కావడం చేత బహు కుటుంబీకుడని, గంగ నీ పుత్రిక యైనందున పతిత పావనుడని బిరుదుగాంచావు.మొదటి నుండియు నీవు దామోదరుడవే.

ఇంగ్లీషు వారికి స్వయంప్రతిభ లేకనే ఇక్కడి భూభాగాన్నీ, సంపదనూ, మానవ సంపదతో ఇక్కడి ప్రజలను పరిపాలిస్తున్నారు. ఇక్కడి గంగను ఉపయోగించుకొని పతిత పావనులనే బిరుదు గాంచారు. మొదటి నుండీ నీవు దామోదరుడవే తుంటరి వానివే ఇది నీ గొప్పతనం కాదు, నీవు సంపాదించిన దోచుకున్న దేశం (భారతదేశం) గొప్పతనం.

కృష్ణాజిల్లా ఘంటసాల మండలానికి చెందిన గ్రామం శ్రీకాకుళం. మచిలీపట్నానికి 39 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ ఆంధ్ర మహావిష్ణు మందిరం ఉంది. ఇక్కడి ప్రముఖుల్లో శ్రీకాసుల పురుషోత్తమ కవి ఒకరు. శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు శతకం పేరులో 108 పద్యాలు రాశారు. ఈ గ్రామాన్ని శ్రీకృష్ణ దేవరాయలు దర్శించి స్వామి వారికి అనేక కానుకలు సమర్పించినట్లు అక్కడి శాసనం ద్వారా తెలుస్తుంది. తాను రాసిన ఆమూక్తమాల్యాద కథŠకు ప్రేరణ ఈ ఆంధ్ర విష్ణు దేవాలయాల్లోనే కలిగినట్లుగా తన గ్రంథంలో రాసుకున్నారు.

“యిష్ట దేవతా ప్రార్థనంబు జేసి మున్నే కళింగ దేశ విజగేషా మనీషం దండెత్తిపోయి విజయ వాటిం గొన్ని వాసరంబు లుండి శ్రీకాకుళనికేతనుండగు నాంధ్ర మధుమధను సేవింపబోయి హరివాస రోపవాసం బచ్చట గావింపనప్ప్పుణ్య రాత్ర చతుర్థ యామంబున”

“గ్రంథకర్త నిద్రించుచుండగా స్పప్నమందు నల్లని శరీరచ్ఛాయ గలిగి, తామర రేకులం దిరస్కరించేడు కన్నులు గలిగి, యురంబునం గేస్తుభ మాణిక్యంబు గలిగి, తన పార్శ్యమందు నిలిచి లక్క్ష్మీదేవి యొక చేత కమలంబును, రెండవ చేత దన హస్తంబు నుంగీలించి యుండ జిఱు నగవుల యందే తన సs గలదయ దెలియు చుండ నా యాంధ్రవల్లభ స్వామి కనుపడి పలికెను”.

“నేనును పూలదండలను దొలుత దానే ధరించి పిమ్మట యవి నాకు సమర్పించిన చిన్నది యగు చూడికుడుత్త నాంచారని యెడ పొలతియు శ్రీరంగ మందు బెండ్లాడిన కథను చెప్ప్పుమనియును, గుర్తు జేసియున్నారు”. అలా శ్రీకాకుళంలో ఆముక్త మాల్యాద (విష్ణు చిత్తీయం) అనే గ్రంథానికి అంకురార్పణ ఇచ్చటనే జరిగింది. ఆ విధంగా వెలుగొందుచున్న గొప్ప జనావాసం శ్రీకాకుళం. “ఆంధ్ర కౌముది” ప్రకారము ఆంధ్ర విష్ణువు శ్రీకాకుళమును పాలించిన చంద్రుని కుమారుడు. ఆర్య మంజుశ్రీ మూల కల్పమను బౌద్ద గ్రంథము ప్రకారము చంద్రుని రాజధాని శ్రీకాకుళము ప్రాచీన కాలమున కృష్ణానది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగదెల నన్న దేశంబు దెలుగేను

దెలుగు వల్లభుండ దెలు గొకండ

యెల్ల నృపులు గొలువ నెఱుగ బాసాడి

దేశ భాషలందు దెలుగు లెస్స

(రాయలవారికి ఈ పద్యము కలలో చెప్పినదే).

ఆముక్త మాల్యద

శ్రీకాకుళము భక్తలోక చింతామణి

శ్రీకాకుళము సుకృతారకరంబు

శ్రీకాకుళము ధరా లోక వైకుంఠంబు

శ్రీకాకుళము మర్త్య సేవితంబు

శ్రీకాకుళము వేదసిద్దాంత మహిమంబు శ్రీకాకుళము హతక్యాకులంబు

శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు శ్రీకాకుళము సర్వసిద్ధికరము

తెలియ శ్రీకాకుళంబు నీ దివ్యదేశ మాంధ్ర నాయక నీవె శ్రీహరివి నిజము.

శ్రీకాకుళ క్షేత్రం భూలోక వైకుంఠమై వెలసినది. గొప్ప పుణ్యక్షేత్రము, వేదములకు నెలవై విలసిల్లిన పుణ్య క్షేత్రము, అంటూ కవి శ్రీకాకుళం గొప్పతనాన్ని తన పద్యంలో వర్ణించారు.

వట్టి గొల్లది రోట గట్ట నోపిన నీకు రోసంబులే దన్న నీనుగలదె? జార చోరాది చేష్టల బ్రవర్తిల్లు నీ కపకీర్తి యన్న భయంబుగలదె? భార్యచే దన్నులు బడ్డవానికి నీకు లజ్జ లేదని యన్న లాగవంబె? కుండుంటు లేదని కొసరి మెక్కిన నీకు హీనత లెంచినన్యూన మగునె?

కోరి దాసులు నిన్నెంత దూరుచున్న

బందమున్నదె నీ కిసుమంతయైన  (ప-41)

నీకు రోసము, సిగ్గు, పౌరుషము, పట్టుదల లేవా? నీ నిజభక్తులు నిన్ను దూషించిన మిన్నకు న్నావు. యశోద రోటికి కట్టి వేసినా రోషపడలేదు. దొంగ తనాలకు పాల్పడిన అపఖ్యాతికి కుంగలేదు. నీ ప్రియసతి తన్నులకు సిగ్గుపడలేదు. ఏమి నీ మాయ.

ఈ పద్యం ప్రధానంగా భారతీయుల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేకంగా రాసినట్లు కనిపిస్తున్నది.

భువన మోహన కృష్ణమూర్తివి నీవేని ….

……. నీదు మహిమను జూపవలదె? (ప-91)

నిజంగా నీవు మహిమ గల దేవుడవే అయితే నీ మహిమ భక్తులకు, ప్రజలకు ఈ క్షేత్రమందు చూపించు. శ్రీకృష్ణ, బలరామ, నృసింహులు నీ అవతారములే అయితే ఆ మహిమలు చూపు దేవా అంటూ ప్రార్థించారు కవి.

అబ్బుకోగలెవో కాయక్లేశ మొనరించు దేవాసురులటుండ దివ్యరమను / దోచుకోగలవో చేసాచి లోకములోని బలి మహాదాత వైభవములెల్ల

రాదీయ గలవొ సత్రాజిత్తుడీకున్న మాణిన్య మంతకమొక మమత గొల్చి / నాటించగలవో సన్నక సన్ననె వనంబుపెట్టు మ్రాన్పెకలించి పెరటిలోన

దెచ్చుకొనవేమి వస్త్రాన్న దీప ధూప

గంధ తాంబూలములకైన గడనదెలిసె (ప-18)

స్వామీ నీకు సొంత సంపాదన లేదు, సామర్థ్యం లేదు. దేవాసుర సముద్ర మథన వేళ అయాచితంగా లక్క్ష్మిని పొందావు. దేహి అని బలిని అర్థించి భూమ్యాకా శాలు ఆక్రమించావు. సత్రాజిత్తు భామతో పాటు శ్యమంతకమణి ఇచ్చాడు. ఇంద్రుడు అంగీకరించి పారిజాతమును నీ పెరటి చెట్టుగా ఇచ్చాడు. వీటిలో నీ సామర్థ్యం ఎక్కడయా స్వామి. వ్యాపారం కోసం దేహి యని అర్థించి భూమ్యాకాశాలను ఆక్రమించాడు (బ్రిటిష్‌వారు). భారత్‌లోని సంస్థానాధిపతులు వారిలోవారు కలహించుకోగా సంపాదన పొందాడు. ఇక్కడి బంగారం అంతా దోచుకుపోయాడు. ఇక్కడి అడవులపై హక్కులు పొందాడు. ఇలా అన్ని రంగాలను దోచుకోగలిగాడు.

కల్లరుల్గాని వ్రేపల్లె వారందరు హర్షింప…. నీ పొంకములు సాగునేమి యచట? (30 ప)

వ్రేపల్లె వాసులు అమాయకులై నిన్ను నమ్మి కొలిచారు, మధురా పురవాసులు సమ్మతించి గౌరవించి, నిన్ను పెద్దను చేశారు. ద్వారకా జనులు నిను కొలుచుటతో అక్కడ కొలువు తీరావు. అమాయకులే నిన్ను నమ్ముదురయ్యా ప్రభూ.

ఇక్కడి ప్రజలు అమాయకులు గనుక వ్రేపల్లె, ద్వారక, మధురా వారి సంపదను దోచుకున్నావు. అమాయకులే నిన్ను నమ్ముదురయ్యా,

“నాగలి రొకలన్నకు…… తీర్పవలె గాని మఱియెండు తీర్చగలడె” (36 ప)

నీవు బహు నేర్పరివి. అన్నదమ్ముల మధ్య చాలా భేదము కల్పించినావు. నాగలి, రోకలి అన్నకిచ్చి నీవు శంఖు, చక్రం ధరించావు, నీవు గరుడధ్వజం ధరించి అన్నకి తాళధ్వ జము కల్పించావు, విలువైన వస్త్రములు నీకు, పనికిరాని వస్త్రములు అన్నకు. అన్నను మత్తులో ముంచి నీవేమో పాలు వెన్న దొంగవలె మెక్కినావు. బ్రిటిష్ వారి పాలనలో అన్న భారతీయులు కాగా, తమ్ముడు బ్రిటిష్ వారు.

గోవింద! ముచి కుంద సేవిత పాదార విందా! నిత్యానంద వివ్వతుంద” (34 ప్ర)

ముచికుందుడు చాలా పరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచికుందుని యుద్దంలో గెలవడం కష్టమని దేవ దానవులకు తెలుసు. త్రేతాయుగంలో పుట్టిన ముచికుందుడు ద్వాపర యుగం వరకూ ఉన్నాడు. దేవ దానవుల యుద్ధంలో ముచికుందుడు దేవతలకు సాయం చేయడం ద్వారా వారు గెలిచారు. దానికి కృతజ్ఞతగా దేవతలు వరం కోరుకోమన్నారు. ముచికుందుడు నాకు బాగా అలసటగా ఉంది నిద్రపోవడానికి మంచి ప్రదేశం చూపమనగా వారు చూపారు. అయితే దేవతలు అతడు నిద్ర కోరుకుంటున్నాడుగాన వానికి నిద్రాభంగం చేస్తే వాడి తల వేయి ముక్కలవుతుందని వరం ఇచ్చారు. యుగాలు మారినా ముచికుందుడు నిద్రావస్తలోనే ఉన్నాడు. ఈ వరం కారణంగా ద్వాపరయుగంలో కాలయవనుడు అనే అసురుని మరణానికి కారణం అయ్యాడు. కాలయవనుడికి యాదవుల చేతిలో ఓడిపోను అనే వరం పొంది ముందు జాగ్రత్తలో ఉన్నాడు.

బలరామకృష్ణుల చేతిలో ఓడిపోయిన జరాసంధుడు, కాలయవనుడితో కలిసి మధురపై దండెత్తేవాడు. యాదవులను సంహరిస్తూ ఉండే వాడు. కాలయవనుడి బాధ భరించలేక యాదవులు మధురలో ఉండటం శ్రేయస్కరం కాదని “ద్వారక” నిర్మాణానికి ఆదేశించాడు కృష్ణుడు. అది జరుగుతూ ఉండగా కృష్ణుడు ఆయుధాలు లేకుండా కాలయవనుడు దగ్గరకు వెళ్లగా అతడు కత్తి చూశాడు. దానికి భయపడి కృష్ణుడు పరుగులంకించు కుని ముచికుందుడు నిద్రపోయే గుహవరకు పరుగెత్తాడు. కాలయవనుడు అతడ్ని వెంబడించి కృష్ణుడు దూరిన గుహలోనికి దూరగా అక్కడ ఒక వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. ఆ వ్యక్తిని గట్టిగా కాలితో తన్నాడు. కాలయవనుడు. ముచికుందుడు కళ్లు తెరిచాడు. కాలయవనుడు భస్మం అయ్యాడు. ఇటువంటి శక్తులను ఇప్ప్పుడు బ్రిటిష్ వారిపై ఎందుకు వాడడం లేదని కవి అడుగుతాడు.

మానుష్య హర్యక్ష మార్తాండ సోమాక్ష, త్రిభువనాధ్యక్ష, కౌంతేయ పక్షి / విలాస మంజుల ధరహాస శ్రీహరిన్నివాస, కౌసేయ వాస

(ఆంధ్రనాయక శతకం 3 ప)

నీవు నరుడిగా కాకుండా నారసింహ అవతారంగా వచ్చి ఈ భారతదేశాన్ని పాలిస్తున్నవారి భరతం పట్టమని, కౌంతేయ పక్ష అంటే కౌంతేయ పక్షం వహించి పాండవులను గెలిపించావు. గజేంద్రుడ్ని రక్షించిన విష్ణుమూర్తిలా వచ్చి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమేయాలని కోరుకుంటున్నాడు కవి.

మూలం:

  1. ఆముక్త మాల్యద సవ్యాఖానము, శ్రీకృష్ణ

దేవరాయలు పేజి. 2. శ్రీమదాంద్ర నాయక శతకము: కాసుల పురుషోత్తమ కవి. 3. Battles of the Honourable East India Company by M.S. Naravane

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు