
70views
దేశ భవిష్యత్తు అంతా కూడా యువత, వారి ఆలోచనలు, విలువలు, చేతలపైనే ఆధారపడి వుందని, యువశక్తే దేశానికి నిజమైన సంపద అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. ఏ దేశ యువత అయితే చైతన్యవంతులుగా, సంస్కారవంతులుగా, ఐకమత్యంతో వుంటారో, ఆ దేశం సహజంగానే అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.
సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని గోరఖ్ పూర్ లో ‘‘దేశ నిర్మాణంలో యువత పాత్ర’’ పేరుతో సంఘ్ ‘‘యువ సంవాద్’’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా అతుల్ లిమానియే, అతిథులుగా గోరక్ష ప్రాంత సంఘచాలక్ డాక్టర్ మహేంద్ర అగర్వాల్, దిగ్విజయనాథ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఓం ప్రకాష్ సింగ్ హాజరయ్యారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS), మదన్ మోహన్ మాలవ్య సాంకేతిక విశ్వవిద్యాలయం మరియు ఇతర విద్యా సంస్థలతో సహా వివిధ రంగాలకు చెందిన యువత, సామాజిక కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతుల్ లిమయే మాట్లాడుతూ యువత స్వయం సమృద్ధిని, క్రమశిక్షణను అలవర్చుకుని, దేశం పట్ల అంకితభావంతో మెలగాలని సూచించారు. యువకుల జీవిత లక్ష్యం కేవలం వ్యక్తిగత పురోగతి మాత్రమే కాకూడదని, సమాజం, దేశాభివృద్ధి కూడా అందులో భాగం అవ్వాలని పిలుపునిచ్చారు. యువత తమ జీవితాల్లో క్రమశిక్షణ, సేవ మరియు అంకితభావం వంటి విలువలను ఆచరిస్తే, భారత్ విశ్వగురు కాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని తేల్చి చెప్పారు.యువత కేవలం తమ వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా, సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను అర్థం చేసుకోవాలని అన్నారు.
కేవలం తమ ఉద్యోగాలు, కెరీర్ మాత్రమే కాకుండా సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలో సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, జాతీయ ప్రయోజనాలను కాపాడాడటం, సమాజానికి సేవ చేసే లక్షణాలున్న యువత కూడా దేశానికే ప్రస్తుతం అవసరమని అన్నారు. ప్రస్తుత కాలం కేవలం అవకాశాల యుగం మాత్రమే కాదు, బాధ్యతల యుగం కూడా అని ఉద్బోధించారు.

సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి యువత ముందుకు రావాలని, దేశ నిర్మాణంలో యువశక్తే అత్యంత నిర్ణయాత్మకమైనదన్నారు. క్రమశిక్షణ, విలువలు మరియు సేవాభావాన్ని తమ జీవితాల్లో అలవర్చుకోవడం ద్వారా, యువత సమాజ మరియు దేశాభివృద్ధికి క్రియాశీలకమైన తోడ్పాటును అందించాలని అతుల్ లిమాయే సూచించారు.





