
గతంలో ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారఘటన ఒక్కటి చాలు పశ్చిమ బెంగాల్‌లో ఎంతటి అరాచకం రాజ్యమేలుతుందో చెప్పడానికి. తమకు ఓటు వేయలేదని… ప్రజలపై ప్రతికారదాడులకు పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ దాష్టీకాలను చూసి ఆనాటి గవర్నర్… స్వయంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పిన ఘటనలు చూశాం. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం కూడా జరుగుతుంది. చనిపోయిన వారితోపాటు, అక్రమ చొరబాటుదారుల పేర్లను సైతం తొలగిస్తున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా మమతా ప్రభుత్వమే. ఇప్పుడు సుప్రీంకోర్టుచే నియమింపబడి సర్ పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులపై దాడికి అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నది కూడా దీదీనే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరిపేందుకు వెళ్లిన ఏడుగురు జ్యుడీషియల్ అధికారులలో ముగ్గురు మహిళా అధికారులు ఉన్నారు. వారితో పాటు వచ్చిన ఐదేళ్ల బాలుడు కూడా నిర్బంధంలో చిక్కుకుపోయాడు. కనీసం తాగునీరు, ఆహారం లేకుండా వారిని 9 గంటల పాటు అల్లరిమూక నిర్బంధించింది, ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనిపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆ లేఖను సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పశ్చిమబెంగాల్ అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా అభిశంసించింది. ఇది రొటీన్‌గా జరిగిన ఘటన కాదని, న్యాయాధికారులను నైతికంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పాల్పడిన దారుణ చర్య అని వ్యాఖ్యానించింది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు నిర్బంధించగానే మొదట హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వెంటనే పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అప్పటినుంచి ఆయన రాత్రి 8 గంటల వరకు పలుమార్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత హోం శాఖ కార్యదర్శి డీజీపీలను, రిజిష్ట్రార్ జనరల్‌ను సంప్రదించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా జోక్యం చేసుకొని హోం శాఖ కార్యదర్శి, డీజీపీలతో గ్రూప్ కాల్ మాట్లాడారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వచ్చారు. చివరకు అర్ధరాత్రి తర్వాత ఆ న్యాయాధికారులు విడుదల అయ్యారు. ఆ తర్వాత వారి వాహనాలపై కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి జరిగింది. రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ స్పందించలేదు. రాత్రివేళ కఠినమైన ఆదేశాలను మౌఖికంగా ఇవ్వాల్సి వచ్చిందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
సర్ ప్రక్రియలో పాల్గొంటున్న ఏడుగురు జ్యుడిషియల్ అధికారులపై దాడి ఘటనను దర్యాప్తు జరుపుతున్న ఎనఐఏ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇది అప్పటికప్పుడు జరిగిన ఆకస్మిక ఆందోళన కార్యక్రమం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా ఎనఐఏ పేర్కొంది. నిమిషాల వ్యవధిలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (బీడీఓ) బయట 1500 మంది ఆందోళనకారులు గుమికూడి సమావేశం అయ్యారని, బీడీఓ కార్యాలయంలో అమర్చిన 16 సీసీటీవీ కెమెరాలలో ప్రధాన ద్వారం వద్ద ఉన్న వాటితో సహా 9 కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు ఎనఐఏ జరిపిన విచారణలో వెల్లడయింది. ఎఫఐఆర్‌లో నమోదు అయిన 105 మంది వ్యక్తులలో 24 మందిని అరెస్టు చేశారు. కేంద్ర బలగాలు వారిని తరలిస్తున్నప్పుడు వారి కాన్వాయ్‌పై పలుచోట్ల రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో వాహనం బోల్తా పడింది. గాయపడిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు చేపట్టిన వారిని సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం మానవత్వాన్ని మంటగలిపినట్లైంది.
ఆందోళనకారులు మహిళలు పిల్లలను రక్షణ కవచంగా ముందు వరుసలో నిలపడమనేది అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఇలా చేయడం వెనక అల్లరి మూకల వ్యూహం ఏమిటో అర్థమవుతుంది. ముందు వరుసలో మహిళలు, పిల్లలు ఉండడం వలన ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతారు. ఒకవేళ అధికారులు లాఠీఛార్జి చేసి బలవంతంగా వారిని చెదరగొట్టడం వంటి కఠిన చర్యలకు దిగితే దీన్ని సాకుగా తీసుకొని పూర్తిస్థాయిలో విధ్వంసానికి పాల్పడే అవకాశం లేకపోలేదు. మహిళా నిరసనకారులపై పోలీసు బలగాలు దాడులు అంటూ ఆ దృశ్యాలను వీడియో తీసి మీడియా ద్వారా విస్తృతంగా ప్రసారం చేసి.. రాజకీయ లబ్ది పొందడం, ఓటర్లలో సానుభూతిని రేకెత్తించి తమకు అనుకూల నెరటివ్‌లను బెంగాల్‌తోపాటు, దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ఉపయోగపడగలదని ఆందోళనకారులు భావించి ఉండవచ్చు.
ఈ నేపథ్యంలో సగటు బెంగాలీ ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే!





