
అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ బెటాలియను చెందిన ఐదుగురు సభ్యులు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయారు. అడవి బాటను వీడి, సాధారణ పౌరులుగా జీవించాలనే నిర్ణయంతో వీరు పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సైతం ఉండటం గమనార్హం. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులై, హింసను వీడి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.
మావోయిస్టులకు ఎస్పీ అమిత్ బర్దార్ స్వాగతం
లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఫలాలను అందుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని చెప్పారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయంతో పాటు అన్ని రకాల పునరావాస సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా అడవిలో ఉంటే జనజీవన స్రవంతిలో కలవాలని, హింసతో ఏదీ సాధించలేమని అమిత్ బర్దార్ తెలిపారు





