News

నక్సల్‌ ప్రాంతంలో ‘నీట్‌’ జెండా.. ఉపాధ్యాయుడి చొరవతో అద్భుతం!

100views

ఒకప్పుడు తుపాకుల మోత, నక్సల్‌ కార్యకలాపాలతో భయం గుప్పిట్లో బతికిన ప్రాంతం నేడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సూర్యాస్తమయమైతే చాలు ప్రజలు ఇళ్లకే పరిమితమైన ఆ ప్రాంతం నుంచి నేడు వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఒక తరం తలరాతనే మార్చేసే ఈ గొప్ప పరివర్తనకు దేవ్‌ ప్రకాశ్‌ అనే ఓ ఉపాధ్యాయుడి కృషి, పట్టుదలే కారణం. విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ అందించి ఎంతో మందిని ఎంబీబీఎస్‌ వైపు ప్రోత్సహిస్తూ మార్గదర్శిగా నిలుస్తున్నారు బిహార్‌కు చెందిన దేవ్‌ ప్రకాశ్‌. ఆయన సారథ్యంలోనే విద్యార్థులు ఆల్‌ఇండియా ర్యాంకులతో సత్తా చాటుతుండటం విశేషం.

బోధనపై ఉన్న అమితమైన ఆసక్తితో దేవ్‌ ప్రకాశ్‌ డీఆర్డీవో వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయం (2020)లో ఆయన తన స్వస్థలం రాణిగంజ్‌కు వెళ్లారు. అక్కడ పిల్లలు చదువు మానేసి చిన్నతనంలోనే పనులకు వెళ్లడంతో కలత చెందారు. ఇంటింటికి వెళ్లి చదువుపై అవగాహన కల్పించి పిల్లల్ని విద్య వైపు నడిపించారు. నీట్‌ వంటి కాంపిటేటివ్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.

దేవ్‌ ప్రకాశ్‌ కృషి ఫలితంగా ఏడుగురు విద్యార్థులు వైద్యులుగా మారారు. ఇందులో ఐదుగురు అమ్మాయిలే ఉండటం విశేషం. చీకటి కమ్ముకున్న తమ జీవితాలకు వెలుగు చూపారంటూ ఆ విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఖరీదైన కోచింగ్‌ సెంటర్లతో విజయం వరించదు. సరైన బోధన, స్థిరమైన ఏకాగ్రత, లక్ష్యంతోనే గెలుపు సాధ్యమవుతుంది. మరిన్ని గ్రామాల్లోని విద్యార్థులను వైద్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తా’’ అని దేవ్‌ ప్రకాశ్‌ చెప్పుకొచ్చారు