ArticlesNews

చోళుల శాసనాల్లో ఎన్నికల ప్రక్రియపై వివరణ

93views

కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్‌ పట్టణంలోని బస్టాండు సమీపంలో పురాతన వైకుంఠ పెరుమాళ్‌ ఆలయం ఉంది. ఈ క్షేత్రంలోని గోడలపై ఉన్న శాసనాలు చోళరాజు పరాంతక-1 పాలనలో సుమారు 1100 ఏళ్ల క్రితం చెక్కారని ఆలయ చరిత్ర చెబుతోంది. అందులో ఎన్నికల ప్రక్రియ, గ్రామాల్లో స్వయం పరిపాలన పద్ధతులను వివరించారు. గ్రామ స్వయం పరిపాలన గురించి సమగ్ర వివరణ అందిస్తున్నందున దీనిని భారతదేశ ప్రజాస్వామ్య చర్రితకు నిదర్శనంగా చరిత్రకారులు పేర్కొంటున్నారు.

వార్డు ప్రతినిధులతో సభ ఏర్పాటు
ఇక్కడ ఉన్న శిలాశాసనాల్లో ఎన్నికల ప్రక్రియను ఏలా చేపట్టాలి, సభ్యుల ఏవిధంగా ఎంపిక చేయాలి, వారి అర్హతలు, విధులు, బాధ్యతలు, వారిని పదవుల నుంచి ఎలా తొలగించాలి, ఎలాంటి పరిస్థితుల్లో తొలగించవచ్చు తదితర అనేక విషయాలను ప్రస్తావిచారు. శాసనాల ప్రకారం వివిధ పనుల కోసం బ్రాహ్మణ సమూహం అనేక ప్రత్యేక కమిటీలను నియమించిందని, స్థానిక సభ లేదా గ్రామసభ పనితీరు ఎలా ఉండేదో తెలుస్తోంది. 30 వార్డులను ఏర్పాటు చేసి ప్రతి వార్డు గ్రామసభకు హజరయ్యేందుకు ఓ ప్రతినిధిని ఎన్నుకుంటుందని, వారితో సభ ఏర్పాటవుతుందని శాసనం వివరిస్తుంది.

సభ్యుల అర్హతలు
అదేవిధంగా ప్రతినిధినికి కావాల్సిన అర్హతలను వివరిస్తున్నాయి. ఆ మేరకు భూమి, గృహం, 35 నుంచి 70ఏళ్ల వయసు, వేద గ్రంథాల్లోని మంత్రాలు, బ్రాహ్మణ జ్ఞానం, వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉండాలి. అంతేకాకుండా నైతిక ప్రవర్తన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఓ వ్యక్తి కనీసం ఒక వేదం, నాలుగు భాష్యాలు నేర్చుకున్నట్టయితే భూమి యాజమాన్య విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చు.

ఐదు మహా పాపాలు
ఓ సభ్యుడిని అనర్హుడిగా చేసే అనేక ప్రమాణాలను వారి బంధువులందరికీ క్రమబద్ధమైన జాబితాలతో వివరిస్తోంది. గతంలో కమిటీ సేవలో ఉన్నప్పుడు ఖాతాలను సమర్పించకపోవడం కూడా ఇందులో ఉంది. ఐదు మహా పాపాల్లో మొదటి నాలుగు అనగా బ్రాహ్మణుడిని హత్య చేయడం, మద్యం సేవించడం, దొంగతనం, వ్యభిచారం ఉన్నాయి. ఆ తర్వాత వెలివేసిన వారితో సంబంధం కలిగి నిషిద్ధ వంటకాలను తినడం ఉన్నాయి.

ఎంపిక ఇలా..
అర్హత ఉన్న వారంతా తాళపత్రాలపై తమ పేర్లను నమోదు చేసుకున్న తరువాత సభా భవనం లోపలి హాలులో ఉంచిన కుండల్లో వేయాలి. తర్వాత పురోహితులు నిర్వహించే విస్తృతమైన లాటరీ ప్రక్రియ ద్వారా ఓ ప్రతినిధిని ఎంపిక చేస్తారు. అలాగే సభలోని వివిధ ముఖ్యమైన కమిటీలు, వాటి నిర్ధిష్ట విధులు, స్థానిక స్థాయిలో రాజు ప్రత్యక్ష నియంత్రణ నుంచి స్వతంత్రంగా పనిచేసే స్వయం పాలన వ్యవస్థ తదితర విషయాలు శాసనాల్లో పొందుపరిచారు. రాజ్యాంగం మాదిరే సభ సభ్యుల విధులు, అధికార పరిమితులు వివరించారు. ఉత్తిరమేరూర్‌ శాసనాలు వ్యక్తిగత ఆదేశాలకు బదులుగా ప్రజాస్వామ్యానికి కీలకమైన చట్టబద్ధమైన పాలనను సమర్థించే పాలనా వ్యవస్థలను తెలియజేస్తున్నాయి.