
విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్‌తో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడిన తర్వాత జిహాదీ భావాలు తీవ్రమయ్యాయని విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులు తెలిపారు. అతడి ఆదేశాల మేరకు భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఐదుగురు నిందితుల కస్టడీ చివరి రోజైన ఆదివారం పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించి కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ వివరాలు కేసులో కీలక మలుపును తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఉగ్ర లింకు కేసు నిందితుల్లో తొలి నుంచీ జిహాదీ భావాలు : విజయవాడ ఉగ్రమూలాల కేసు నిందితులు మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం, బళ్లారి వాసి అబ్దుల్ సలామ్‌ల 5 రోజుల కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. సీఐ సెల్ అధికారులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలకు చెందిన అధికారులు నిందితుల్ని ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టారు. తొలి నుంచీ తమలో జిహాదీ భావాలున్నప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో విదేశీ హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్ పరిచయమైన తర్వాతే అవి తీవ్రరూపం దాల్చాయని నిందితులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలు విస్తృతం చేసే యత్నం : షుకూర్ ఆదేశాల మేరకే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలను భారత్‌లో విస్తృతం చేయడానికి, జిహాద్ కోసం ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించటమే లక్ష్యంగా పనిచేశామని చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే బెన్‌ఎక్స్ కామ్ పేరిట ఇన్‌స్టాగ్రామ్, టెలీగ్రామ్‌లో పలు గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపినట్లు సమాచారం. తీవ్రవాద భావజాలం కలిగినవారు, జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని అందులో సభ్యులుగా చేర్చామని చెప్పినట్లు తెలిసింది. వారితో నిరంతం సంప్రదింపులు జరిపేవాళ్లమని నిందితులు తెలిపినట్లు సమాచారం.
అంశాలపై భారీ ప్రశ్నలు : బెన్‌ఎక్స్ కామ్ గ్రూపులో పాకిస్థాన్ దేశీయులు సభ్యులుగా ఉన్నారని విజయవాడ ఉగ్రమూలాల కేసు నిందితులు చెప్పినట్లు తెలిసింది. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను వారి ద్వారానే తెప్పిస్తానంటూ అల్ హకీం షుకూర్ తమతో చెప్పినట్లు కొందరు నిందితులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. జిహాది కార్యకలాపాల పట్ల ఆకర్షితులవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? విదేశీ హ్యాండ్లర్లతో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? భారత్‌లో దాడులకు వేసిన ప్రణాళికలు, బెన్‌ఎక్స్ గ్రూపులో ఎలా విస్తరించారు? దాన్ని తెర వెనక నుంచి నడిపిందెవరు? వంటి అంశాలపై నిందితుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం.
షుకూర్‌ను నేరుగా ఎన్నడూ కలవలేదన్న నిందితులు : అల్ హకీం షుకూర్‌ను నేరుగా ఎన్నడూ కలవలేదని నిందితులు చెప్పినట్లు సమాచారం. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారానే పరిచయమని చెప్పారని తెలిసింది. షుకూర్ చెప్పినట్లుగానే నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్- AQIS, ఐసిస్‌తో నిరంతరం సంబంధాలు కొనసాగించామని నిందితులు వెల్లడించినట్లు సమాచారం. అతడి ఆదేశాల మేరకు గజ్వా-ఎ-హింద్ కోసం పనిచేస్తూ నెట్‌వర్క్ విస్తరించామని చెప్పినట్లు తెలిసింది.
భారత జాతీయజెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టడమే లక్ష్యం : భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనేది తమ లక్ష్యమని నిందితులు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే భారత జాతీయజెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టడం, జాతీయగీతాన్ని హేళన చేయడం, జాతీయ జెండా దహనం చేయడం, ఐసిస్‌ను పొగడటం, ఇస్లాంను విశ్వసించనివారిపై విషం చిమ్మడం వంటివి చేసేవాళ్లమని విచారణలో చెప్పినట్లు తెలిసింది. తమను తాము ముజాహిదిన్‌లుగా ప్రకటించుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవాళ్లమని వెల్లడించినట్లు సమాచారం. ‘ఏ నేషన్ లెడ్ బై మహమ్మద్ విల్ నాట్ సరెండర్’ అంటూ పోస్టు చేసేవాళ్లమని తెలిపినట్లు తెలిసింది. షుకూర్ ఆదేశాలతోనే ఇవన్నీ చేశామని వివరించినట్లు సమాచారం.
యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నాలు: సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించి వారిని పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లకు పంపించి మిలిటెంట్ శిక్షణ తీసుకునేలా ప్రేరేపించాలని షుకూర్ ఆదేశించేవాడని నిందితులు తెలిపినట్లు సమాచారం. వాటిని తాము పాటించేవాళ్లమని నిందితులు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించారని తెలిసింది. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయగా, ఐదుగురిని తొలివిడతగా పోలీసులు కస్టడీ కోరారు. మిగతా నిందితుల కస్టడీపై న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సి ఉంది.





