ArticlesNews

నిత్య విద్యార్థి

83views

ప్రతి వ్యక్తీ నిత్య విద్యార్థిలా ఉండాలంటారు అనుభవజ్ఞులు. ఉపాధినిచ్చే చదువు మాత్రమే కాక వ్యక్తిత్వపరంగా ఎదుగుదలకు సహకరించే ఏదో ఒక అంశాన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. దానివల్ల మేధస్సు పదును బారుతుంది. అలా సరికొత్త విషయాలను అభ్యసించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం నేర్చుకోవాలనే తపన. ఇది ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా మనిషి అనుకున్నది సాధించగలుగుతాడు.

వేదవిద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించాలనుకున్నాడు హనుమంతుడు. సరైన గురువు కోసం అన్వేషించినప్పుడు సాక్షాత్తూ సూర్య భగవానుడే అందుకు తగినవాడుగా అనిపించింది. ఆయనను సమీపించి విద్యా బోధన చేయమని అర్థించాడు. సూర్యుడు చిరునవ్వుతో ‘కుదురుగా ఒకచోట ఉండటం కుదరనివాణ్ని. వేగంగా వేలాది యోజనాల దూరం సాగిపోయే నా దగ్గర నువ్వెలా విద్యాభ్యాసం చేయగలవ’ని ప్రశ్నించాడు. తమరు అనుమతిస్తే అదేమంత పెద్ద విషయం కాదన్నాడు ఆంజనేయుడు. సరేనంటూ రథం ఎక్కాడు సూర్యుడు. రెప్పపాటులోనే అది అల్లంత దూరానికి సాగిపోయింది. అంజనాసుతుడు ఏమాత్రం ఆలోచించకుండా గాలిలోకి ఎగిరాడు. సకల విద్యాపారంగతుడు కావాలన్న కోరిక మారుతిని ముందుకు నడిపే ఇంధనమైంది. సర్వదేవతల అనుగ్రహాన్ని పొంది ఉండటం వల్ల అరక్షణంలోనే లోకరక్షకుడైన సూర్యుణ్ని సమీపించగలిగాడు. అప్పట్నుంచీ సూర్యుడితో సమానమైన వేగంతో ఎగురుతూ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆంజనేయుడిలో శక్తియుక్తులతోపాటు తీవ్రమైన జిజ్ఞాస ఉండటం వల్లనే తరవాత కాలంలో వేదవిద్యా ప్రవీణుడనీ, వాక్కును సరైన విధంగా పలకడంలో సమర్థుడనీ సాక్షాత్తూ శ్రీరాముడి ప్రశంసలు అందుకున్నాడు.

ఉగ్గుపాలు పడుతూ తల్లి పలికే శబ్దాలను, హావభావాలను అర్థం చేసుకునే ప్రయత్నంతో మనిషిలో నేర్చుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఆ దశలో అతడి హృదయం తెల్లకాగితంలా స్వచ్ఛంగా ఉంటుంది. తొలుత తప్పుగా పలుకుతాడు, తప్పటడుగులు వేస్తాడు. ఇది పొరపాట్ల నుంచి నేర్చుకోవడం. అలా జీవితాంతం కొత్తవి నేర్చుకునేవారే ఉన్నత స్థాయికి వెళ్లగలరు. క్రమశిక్షణ, నిత్యసాధన ఉంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవడంలో రాణించగలరు. ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని రోజుల్లో సూర్యగమనాన్ని తదేక దీక్షతో గమనిస్తూ కాలనిర్ణయాన్ని చేసిన రుషుల పట్టుదల మనందరికీ ఆదర్శం. పూర్వకాలంలో విద్యార్థులు గురువుకు భక్తితో శుశ్రూష చేసేవారు. అందరూ అనుకుంటున్నట్లు శుశ్రూష అన్న మాటకు సేవలు చేయడమనే అర్థం కాదు, వినాలన్న కోరిక మాత్రమే. అనేక వాంఛలతో మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసే మనోతాపం ఉపాధ్యాయుడి ముఖతః వెలువడే జ్ఞానామృతంతో చల్లారుతుంది. ఆ కారణంతోనే శిష్యులు గురువును సేవించేవారు.

సాంకేతిక విప్లవం కారణంగా వర్తమాన సమాజం వేగంగా మారుతోంది. నైపుణ్యాలు పెంచుకోనివారిని కాలం వెనక్కి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో నేర్చుకున్న దాంతో సంతృప్తి చెందడం అస్త్రసన్యాసం చేయడంతో సమానం. కొత్త విషయాలను అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉండాలే కానీ అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌ సురాసుర గురువులైన బృహస్పతి శుక్రాచార్యులతో సమానంగా అంతరిక్షంనుంచి ఆధ్యాత్మికం వరకూ అన్ని విషయాలను నేర్పిస్తుంది. మనం నేర్చుకోవడమే ఆలస్యం.