News

బీజింగ్‌లో చైనా కళాకారులు రామాయణం నృత్య నాటక ప్రదర్శన

75views

చైనా రాజధాని బీజింగ్‌లోని భారత పాత రాయబార కార్యాలయ ప్రాంగణంలో చైనాకు చెందిన స్థానిక కళాకారులు రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన “ఆది కావ్య- ది ఫస్ట్ పోయెమ్” అనే నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నృత్య నాటకానికి ప్రముఖ చైనీస్ భరతనాట్య కళాకారిణి జిన్ షాన్షాన్ దర్శకత్వం వహించారు. దాదాపు 50 మందికి పైగా చైనా స్థానిక నృత్యకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రఖ్యాత చైనీస్ భాషావేత్త, ప్రొఫెసర్‌ జి షియాన్‌లిన్‌ చైనీస్‌లోకి అనువదించిన రామాయణం ఆధారంగా ఈ నృత్య రూపాన్ని రూపొందించారు. ఈ రామాయణ కథను పూర్తిగా చైనీస్ భాషలో, భరతనాట్య శైలిలో ప్రదర్శించడం విశేషం.పదవీ విరమణ చేయనున్న భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్‌తో పాటు ఎంబసీ అధికారులు, బీజింగ్‌లోని దౌత్యవేత్తలు, చైనా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.బీజింగ్‌లో ఈ నృత్య నాటకాన్ని ప్రదర్శించడం ఇది మూడోసారి. భారత, చైనా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని, భావజాలాన్ని బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.