News

36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం

196views

కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి ఉన్న శ్రీ రఘునాథ్ మందిరానికి ఇన్నాళ్ల తర్వాత మంచి రోజులు వచ్చాయి. సరిగ్గా శ్రీరామనవమి నాడే దశాబ్దాల తర్వాత శ్రీనగర్ వాసులు రఘునాధుడ్ని దర్శించుకున్నారు..

కాశ్మీర్ లోయలో 36 సంవత్సరాలు పాటు మూతపడి ఉన్న శ్రీ రఘునాథ్ మందిరం తెరుచుకుంది . సరిగ్గా శ్రీరామనవమి నాడే దశాబ్దాల తర్వాత శ్రీనగర్ వాసులు రఘునాధుడ్ని (శ్రీ రాముడ్ని ) ఎలాంటి భయమూ లేకుండా మనస్ఫూర్తిగా దర్శించి పూజలు చేస్తున్నారు

1857 తో మహారాజా గులాబ్ సింగ్ నిర్మించిన చారిత్రిక రఘునాథ్ ఆలయం
ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముడ్ని ” రఘునాథ” పేరుతో కొలుస్తారు. ముఖ్యంగా జమ్మూ & కాశ్మీర్ తో రఘునాథుడి పూజ చాలా పాపులర్. కాశ్మీర్ రాజ్య పాలకులైన డోగ్రా రాజు వంశీకుడు గులాబ్ సింగ్ 1835 లో జమ్మూ లో శ్రీ రఘునాథ్ ఆలయాన్ని నిర్మించారు. అది చాలా పెద్ద టెంపుల్ కాంప్లెక్స్. ఒకే గుళ్లో ఏడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఆలయం అది. అందులో ప్రధాన దేవుడు శ్రీరాముడే (రఘునాథ్ ). ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత గులాబ్ సింగ్ శ్రీనగర్ లో కూడా రఘునాధ ఆలయాన్ని నిర్మించడానికి రెడీ అయ్యాడు. జీలం నది ఒడ్డున రఘునాథ్ మందిరాన్ని నిర్మించి 1857లో ఆలయంలో రఘునాథున్ని ప్రతిష్టించారు.

ఉగ్రవాదుల ఊచకోతతో మూతపడిన రఘు నాథ్ ఆలయం
శ్రీనగర్ లోని హబ్బా కాదల్ ప్రాంతం లో నిర్మించిన ఈ రఘునాథ ఆలయం పోషణ, సేవ కాశ్మీరీ పండిట్లే నిర్వహించేవారు. అయితే 1990లో పాకిస్తాన్ ప్రోత్సాహంతో తీవ్రవాద మూకలు అరాచకాలకు, ఊచకోత లకు పాల్పడడంతో భారీ ఎత్తున కాశ్మీర్ పండిట్లు, హిందువులు శ్రీనగర్ వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటినుంచి అంటే 36 ఏళ్ల పాటు శ్రీనగర్లోని రఘునాథ ఆలయం మూతపడే ఉంది.

శ్రీ రామ నవమి సందర్బంగా ఇన్నాళ్లకు తెరుచుకున్న రఘునాథ్ మందిర ద్వారాలు
ఇప్పుడిప్పుడే శ్రీనగర్ లో పరిస్థితులు చక్కబడుతూ ఉండడంతో 36 ఏళ్ల తర్వాత శ్రీనగర్ లోని రఘునాథ మందిరం భక్తుల కోసం ద్వారాలు తెరిచింది. గురువారం నాడు శాస్త్రీయ పద్ధతిలో “హవన” కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితులు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఉదయం నుండి భక్తులు రఘునాథుడ్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు భక్తులు. జమ్మూ అండ్ కాశ్మీర్ స్మార్ట్ సిటీ ఇన్షియేటివ్ కార్యక్రమంలో భాగంగా అక్కడి ప్రభుత్వం ఆలయాన్ని మరమ్మత్తు చేసింది. ఈ కార్యక్రమాన్ని శ్రీనగర్లోని సాంస్కృతిక పునరుజ్జీవనం, సమైక్యత మరియు శాంతి కి నిదర్శనంగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. త్వరలోనే రఘునాథ మందిరంలో సరికొత్త విగ్రహాలను ప్రతిష్టించాలని రఘునాథ ఆలయ కమిటీ నిర్ణయించింది.

36 ఏళ్ల తరువాత మోగిన రఘునాథ్ ఆలయ గంటకు పులకరించిన శ్రీనగర్ వాసులు
పూర్తిగా 36 సంవత్సరాలు పాటు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయిన శ్రీనగర్ రఘునాథ మందిరం ఇన్నాళ్లకు అదీ శ్రీరామనవమి నాడు తెరుచుకోవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మోగిన ఆలయ గంటల శబ్దం విని ఆనందంతో తమ కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి అంటూ పలువురు స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే దేశంలోనే పలు ప్రాంతాల నుంచి నగర్ చేరుకున్న కాశ్మీరీ పండిట్లు ఉదయం నుండీ ఆలయ ప్రాంగణంలోపూజలు చేస్తున్నారు. తీవ్రవాదుల అరాచకాలకు ముందు శ్రీనగర్ లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా శాంతి తోనే జీవించామని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు మరోసారి ఏర్పడే అవకాశం వచ్చిందని అక్కడి వారు చెబుతున్నారు.