News

రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు

7views

ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్రకు  ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  స్వామివారి రథాలు కదిలేందుకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం భారతీయ రైల్వే 300కి పైగా ప్రత్యేక రైళ్లను, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 బస్సులను అందుబాటులో ఉంచింది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. మొత్తం 13,000 మంది పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు పహారా కాస్తున్నారు. తీరప్రాంతంలో 500 మంది లైఫ్ గార్డులను సిద్ధంగా ఉంచారు.

షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించే ప్రక్రియ జరుగుతుంది. పూరీ గజపతి మహారాజు రథాలను శుద్ధి చేసిన అనంతరం, సాయంత్రం 4 గంటలకు భక్తులు రథాలను లాగడం ప్రారంభిస్తారు. జగన్నాథుని ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు సుమారు 2.6 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.