News

అమరావతిలో జగన్నాథ రథయాత్ర

23views

రోజువారీ జీవితంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో ప్రశాంతతను నెలకొల్పే కేంద్రాలుగా దేవాలయాలు నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వద్ద తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రను గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. పూరీ జగన్నాథ రథయాత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ రథం ముందు బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసిన అనంతరం రథాన్ని తాడుతో లాగి యాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతల రథయాత్రలో పాల్గొన్న ఆయన, అమరావతి విశ్వనగరిగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల ప్రభావంతో మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని, దీని ప్రభావం కుటుంబ వ్యవస్థపై కూడా పడుతోందని సీఎం అన్నారు. ఆత్మహత్యలు, చిన్నారులపై దాడులు వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మానసిక ప్రశాంతత పెంపొందించేందుకు ఆధ్యాత్మికత అవసరమని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 5,000 శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగాలని, సూక్ష్మ కుటుంబాల కంటే కుటుంబ బంధాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

అమరావతిలో ప్రతి ఏడాది జగన్నాథ రథయాత్ర నిర్వహించాలని ఇస్కాన్ సంస్థ నిర్ణయించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ప్రజా సేవలోనూ ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ విశేష సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సుమారు 25 వేల పాఠశాలల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 10 కేంద్ర వంటశాలల ద్వారా సుమారు 1.80 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నట్లు చెప్పారు.

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణలో ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి. నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.