News

ద్వారక తిరుమలలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ

6views

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం ఏలూరు జిల్లా  ద్వారక తిరుమలలో విజయవంతంగా నిర్వహించారు. జూలై 11, 12 తేదీల్లో జరిగిన ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర, గోదావరి, అమరావతి జోన్లు, నెల్లూరు జిల్లాకు చెందిన మొత్తం 18 జిల్లాల నుంచి 174 మంది పాల్గొన్నారు.

శిక్షణ శిబిరంలో 18 జిల్లాల నుంచి మొత్తం 174 మంది పాల్గొన్నారు. వీరిలో 126 మంది ఇప్పటికే బాల వికాస్ కేంద్రాల్లో బోధిస్తున్న శిక్షణ పొందిన మాతాజీలు, ఆచార్యులు కాగా, 48 మంది తొలిసారిగా శిక్షణ పొందారు. మొత్తం పాల్గొన్న వారిలో 154 మంది మాతాజీలు, 20 మంది ఆచార్యులు ఉన్నారు. మాతాజీలతో పాటు 50 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. శిక్షణను 15 మంది జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్లు, సహ కన్వీనర్లు నిర్వహించగా, కార్యక్రమ నిర్వహణలో 43 మంది ప్రబంధకులు సేవలందించారు.  .

ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్ శ్రీమతి అద్దంకి విజయలక్ష్మి పర్యవేక్షణలో 15 మంది జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్లు, సహ కన్వీనర్లు తమ అనుభవంతో శిక్షణ అందించారు. అలాగే 43 మంది ప్రబంధకులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

ద్వారక తిరుమల దేవస్థానం జూలై 10 నుంచి 12 వరకు మాధవ సదన్‌లో సామూహిక హాల్స్, వసతి, భోజనం, అల్పాహారం, తేనీరు తదితర అన్ని సౌకర్యాలను కల్పించింది.

శిక్షణలో భాగంగా బాల వికాస్ బోధనా విధానాలు, దేశభక్తి గీతాలు, పద్యాలు, అభినయ గేయాలు, అమృత వచనాలు, శ్లోకాలు, చిన్న కథలు, విద్యా ఆటలను అభ్యసింపజేశారు. సంస్థ కోశాధికారి శ్రీ వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా పాల్గొన్న వారికి బాల వికాస్ కిట్లు, సరస్వతి దేవి, భారతమాత చిత్రపటాలు, ఆటల సామగ్రిని పంపిణీ చేశారు.

ప్రారంభ కార్యక్రమానికి ప్రాంత ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి, ప్రాంత ఉపాధ్యాయ ప్రముఖ్ శ్రీమతి విజయలక్ష్మి, ప్రాంత సహ సంయోజకులు శ్రీ తులసి ప్రకాష్, శ్రీ ముద్దు సాయిరామ్‌తో పాటు దేవస్థానం బోర్డు సభ్యుడు శ్రీ తాండ్ర సందీప్, ఏఎంసీ చైర్మన్ శ్రీ సత్యకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

శిబిరంలో భాగంగా సాయంత్రం పాల్గొన్నవారు బృందాలుగా విడిపోయి సృజనాత్మక ఆటల్లో పాల్గొన్నారు. అనంతరం గోవింద నామస్మరణ, భజన గీతాలు, కాషాయ పతాకాలతో నగర సంకీర్తన నిర్వహించి స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం దక్షిణ గోపురం వద్ద సామూహిక హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు.

శిబిరంలో పాల్గొన్న పలువురు మాతాజీలు, ఆచార్యులు తొలిసారిగా ద్వారక తిరుమల దర్శనం చేసుకునే అవకాశం లభించిందని, బాల వికాస్ శిక్షణ ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ముగింపు కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో దుర్గారావు, కాకి సురేష్ ప్రసంగించారు. ప్రాంత ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి, సంస్థ అధ్యక్షులు శ్రీ విష్ణు ముగింపు సందేశం అందించారు.

విభాగ్ ధర్మ ప్రచారక్ శ్రీ భూపతి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా సహ కన్వీనర్లు శ్రీ తిప్పాభట్ల రామకృష్ణ, శ్రీ గోపాల్, ఉంగుటూరు, నూజివీడు ఖండ కన్వీనర్లు, జిల్లా ధర్మ ప్రచారకులు, కార్యాలయ ప్రముఖులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ శిక్షణా శిబిరానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు కలగాలని ప్రాంత కమిటీ ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.