ArticlesNews

గాంధీ స్ఫూర్తితో ‘ప్లాస్టిక్ ఫ్రీ వాక్​’- గ్రీన్​మ్యాన్ ఆశయమిదే!

79views

మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ విడదీయలేని భాగమైపోయింది. పర్యావరణం, జంతుజాలంపై ప్లాస్టిక్‌ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. అయినప్పటికీ ప్లాస్టిక్ వాడకం తగ్గట్లేదు. అందుకే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు ఒడిశాకు చెందిన పర్యావరణవేత్త, విద్యావేత్త సుధీర్ రౌత్. వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా వీధుల్లో ఒడియా, ఆంగ్ల భాషల్లో సందేశాలున్న ప్లకార్డులను ఒంటికి తగిలించుకుని, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్లాస్టిక్‌పై గ్రీన్ మ్యాన్ పోరాటం
బెర్హంపుర్‌కు చెందిన సుధీర్ రౌత్ విద్యావేత్త, పర్యావరణవేత్త. ఆయన్ను అందరూ ‘గ్రీన్ మ్యాన్‌’ అని పిలుచుకుంటారు. సుధీర్ రౌత్ బెర్హంపుర్ నగరంలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ రహిత అవగాహన పాదయాత్రను చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంత్రం వేళ ప్రధాన రహదారులు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రజలకు కోరుతున్నారు. ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, బాటిల్స్‌ను ఉపయోగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

రోజుకు 5-6కి.మీ నడక
ప్రతిరోజూ దాదాపు 5-6 కిలోమీటర్లు నడుస్తూ ప్రయాణికులు, వ్యాపారులు, కొనుగోలుదారులతో సుధీర్ రౌత్ నేరుగా మాట్లాడుతున్నారు. ప్లాస్టిక్‌ని వాడకుండా, దానికి బదులుగా పర్యావరణ అనుకూల సంచులను వాడాలని కోరుతున్నారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను పర్యావరణ చర్చలకు వేదికలుగా మార్చుకుంటున్నారు. మహాత్మ గాంధీ చేసిన శాసనోల్లంఘన ఉద్యమం, దండి మార్చ్​ స్ఫూర్తితో మార్చి 12న ఈ అవగాహన పాదయాత్రను ప్రారంభించారు.

‘భవిష్యత్ తరాల కోసం ‌ప్లాస్టిక్‌ను వాడొద్దు’
ఏప్రిల్ 6వరకు ఈ పాదయాత్రను చేస్తానని గ్రీన్ మ్యాన్ సుధీర్ రౌత్ చెప్పారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రానున్న రోజుల్లో మనల్ని ఒక భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్- సముద్రాల నుంచి పర్వత శ్రేణుల వరకు అన్నిచోట్లకు వ్యాపించిందని అన్నారు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలను కలిగిస్తోందని పేర్కొన్నారు.

‘మన జీవితంలో ప్లాస్టిక్‌ను భాగం చేసుకున్నాం’
“దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినట్లుగా మనం ఒక ప్లాస్టిక్ బాంబుపై కూర్చున్నాం. మన సౌలభ్యం కోసం ప్లాస్టిక్‌ను వాడేస్తున్నాం. మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్‌ను ఓ భాగం చేసుకున్నాం. ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నాం. పాలిథీన్ సంచుల్లో ఆహారాన్ని తీసుకువెళ్తున్నాం. ప్లాస్టిక్ స్ట్రాలను ఉపయోగిస్తున్నాం. వాటిని వాడి పారేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడికి వెళ్తుంది? అది భూమిలో కలవడానికి కొన్నేళ్లు పడుతుంది. మట్టిలోకి వెళ్లి భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. జీవావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. వాస్తవాలను పట్టించుకోకుండా ప్లాస్టిక్​ను నిర్లక్ష్యంగా వాడుతుంటే మనం మన భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నట్లే అవుతుంది. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు ఈ భూమిపై ఎక్కడ జీవిస్తాయి?” అని సుధీర్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాత్రికే రాత్రే ఎవర్నీ మార్చలేం : సుధీర్ రౌత్
తాను చేస్తున్న ప్లాస్టిక్ అవెర్‌నెస్ పాదయాత్రకు కొందరు మద్దతు ఇస్తుండగా, ఇంకొందరు ఎగతాళి చేస్తున్నారని సుధీర్ రౌత్ తెలిపారు. అయినప్పటికీ తాను ఉన్నత లక్ష్యంలో ముందుకు సాగుతున్నానని చెప్పారు. “మనం రాత్రికి రాత్రే ప్రజలను మార్చలేం. అలాగే మనం చెప్పేది అందరూ అంగీకరించి, అలవాట్లను మార్చుకుంటారని కూడా ఆశించకూడదు. 1000 మందిలో ఇద్దరు తమ పద్ధతులను మార్చుకున్నా నా ప్రయత్నం విజయవంతమైనట్లే. కొందరు నీరు, నేలను పట్టించుకోకుండా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతారు. మరికొందరు నదులను శుభ్రపరచడం గురించి మాట్లాడతారు. కానీ ప్లాస్టిక్ విషయంలో మౌనంగా ఉంటారు. పర్యావరణ పరిరక్షణ సమగ్రంగా ఉండాలి” అని సుధీర్ రౌత్ అభిప్రాయపడ్డారు.