
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ ముఠాను ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు గుర్తించి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ కేసులో మరో ముగ్గురిని ఘాజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరిందని అధికారులు తెలిపారు. మార్చి 13న మొదటిసారిగా ఈ రాకెట్‌ను ఛేదించిన ఘాజియాబాద్ పోలీసులు, అప్పటి నుంచి ఈ నెట్‌వర్క్‌లోని ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.
తాాజాగా అరెస్టయిన వారిలో బిహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన సమీర్ అలియాస్ షూటర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గూఢచర్యంలో ఇతను ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. సమీర్ ప్రస్తుతం దిల్లీలో నివసిస్తున్నాడు. భారత్‌లోని కీలక సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు సమాచారం అందించడంలో సమీర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమీర్‌తో పాటు షామ్లీకి చెందిన సమీర్, షాజహాన్‌పూర్‌కు చెందిన శివరాజ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కూడా విచారిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఘాజియాబాద్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుపై జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు.
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత
ఈ గూఢచారి రాకెట్‌ను పాకిస్థాన్ నుంచి సర్దార్ అలియాస్ జోరావర్ సింగ్ అనే వ్యక్తి నడుపుతున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ రాజ్ కరణ్ నాయర్ తెలిపారు. భారత్‌లో ఉన్న నిందితులు సోషల్ మీడియా వేదికల ద్వారా సర్దార్‌తో నిరంతరం టచ్‌లో ఉండేవారని వెల్లడించారు. ఇక్కడ సేకరించిన ఫోటోలు, వీడియోలు, భద్రతా బలగాల కదలికలను ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా పాకిస్థాన్‌కు పంపినట్లు చెప్పారు.
ఈ ముఠాను భారత్‌లో సుహైల్ అలియాస్ రోమియో అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోమియో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ నివాసి. ఇతని కింద పలువురు పనిచేస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన నౌషాద్ అలీ దిల్లీలోని పోలీస్ ఇన్స్టాలేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద రెక్కీ నిర్వహించేవాడు. ఈయన ఫరీదాబాద్‌లోనే ఉంటూ కీలక ప్రాంతాల వీడియోలను పాకిస్థాన్‌కు పంపేవాడు. మథురకు చెందిన మీరా ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా సుహైల్‌కు పరిచయమైంది. 2025లో ఈమె ఆయుధాల అక్రమ రవాణా కేసులో దిల్లీ స్పెషల్ సెల్ చేతికి చిక్కింది. తాను ముంబై పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నానని నమ్మబలుకుతూ ఈ గూఢచారి కార్యకలాపాలు సాగించేది. సుహేల్ మాలిక్, ప్రవీణ్, రాజ్ వాల్మీకి, శివ వాల్మీకి, రితిక్ గంగ్వార్ వంటి వారు ఈ గుఢచర్యంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసులో అరెస్టు అయిన వారిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ముఠా ఒక వ్యూహాత్మకంగా మైనర్లను తమ టీమ్‌లోకి రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తక్కువ చదువుకున్న, పేదరికంలో ఉన్న హిందూ మైనర్ బాలురను తమ నెట్‌వర్క్‌లోకి చేర్చుకోవాలని పాక్‌లోని ఆర్గనైజర్ చెప్పడంతో వారినే రిక్రూట్ చేసుకున్నారు. దిల్లీలోని కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సోలార్‌తో పనిచేసే సీసీటీవీ కెమెరాలను రహస్యంగా అమర్చడానికి కూడా ఈ మైనర్లనే ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫొటోకు రూ.5000
ఈ గూఢచారి ముఠాకు నిధులు ఎలా వచ్చేవి అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ నుంచి పంజాబ్ సరిహద్దుల మీదుగా నిధులు భారత్‌లోకి వచ్చేవని గుర్తించారు. బ్యాంకు అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిగితే పట్టుబడతామనే భయంతో చిన్న చిన్న కిరాణా షాపులు, మనీ ట్రాన్స్‌ఫర్ సెంటర్ల అకౌంట్లను వీరు వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాక్‌లోని హ్యాండర్లు భారత్‌లోని ముఠాకు ఒక్కో సమాచారం లేదా ఫోటోకు 5,000 వరకు ఇచ్చేవారిని పోలీసులు గుర్తించారు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పంపితే అనుమానం వస్తుందని, వ్యూహాత్మంగా చిన్న మొత్తంలో పంపినట్లు భారత్‌లోని ముఠాకు పాక్ హ్యాండ్లర్లు పంపినట్లు విచారణలో తేలింది.





