
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నగర శివారులోని కాశినాయన ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యవక్తగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత R.S.S ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగ వివరాలు ఆయన మాటలలోనే……
దేవ దానవులు క్షీర సాగర మథనం చేసినప్పుడు అందులోనుండి హాలాహలం ఉద్భవించింది. ఆ హాలాహలం సకల లోకాలను దహించి వేసే ప్రమాదం ఉండడంతో పరమ శివుడు ఆ హాలాహలాన్ని తానే స్వీకరించాడు. అయితే జగమంతా శివ మయమైనప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరిస్తే సకల జగత్తు నాశనమవుతుంది కదా? అందుకే శివుడు ఆ హాలాహలాన్ని గొంతు దిగనివ్వకుండా తన కంఠంలో దాచాడు. అందుకే ఆయన గరళ కంఠుడయ్యాడు. విషాన్ని స్వీకరించడంతో ఆయన కంఠం నీల వర్ణంలోకి మారిపోయింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. హాలాహలం స్వీకరించిన తరువాత ఆ విష ప్రభావం వలన శివుడు సృహతప్పి పడిపోయాడు. బ్రహ్మ, విష్ణు ,దేవేంద్ర దులందరు ఆందోళన చెందారు. తల్లి పార్వతీ దేవి తన ఒడిలో పడుకోబెట్టుకుని సేద తీర్చుకునే అవకాశం ఇచ్చింది. దేవ దేవుడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడోనని విష్ణు మూర్తి, బ్రహ్మ దేవుడు, దేవేంద్రుడు అందరి తోపాటు సకల దేవతలు ఎదురు చూశారు. దానికి గుర్తుగా ఈ రోజు జాగారం చేస్తారు. ఏ రోజు అయితే ఈ పరమశివుడు విషాన్ని స్వీకరించారో ఆ రోజునే మనం మహాశివరాత్రిగా భావిస్తాము. ఇటువంటి పుణ్యమైన రోజు ఈ మహాశివరాత్రి.

ప్రసంగిస్తున్న శ్రీ బయ్యా వాసు
అలానే హిందుత్వం ఎంత గొప్పది అంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో కొందరు శక్తివంతులకు మాత్రమే నమస్కరిస్తారు. మరికొందరు ధనవంతులకు మాత్రమే నమస్కరిస్తారు. కానీ మన భారతదేశంలో యోగులకు నమస్కరిస్తారు. అటువంటి దేశంలో పుట్టడం మన అదృష్టం. అంబానీ గారు వస్తే ఇక్కడ ఎవరూ పాదాభివందనం చేయరు. కోటీశ్వరుడు వస్తే పాదాలకు నమస్కరించరు. అదే ఒక కాషాయ వస్త్రం ధరించిన ఒక సన్యాసి వస్తే అంబానీ కూడా పాదాభివందనం చేస్తారు. ఈ భూమిని యోగ భూమి,ధర్మ భూమి, పుణ్యభూమి అని ఎందుకు అంటారు? అంటే ఎక్కడైతే కృష్ణ జింక సంచరిస్తుందో అక్కడ పుట్టిన వారికి మోక్షం కలుగుతుంది. ప్రపంచం మొత్తం మీద కృష్ణ జింక సంచరించే దేశం ఒక్క భారతదేశం మాత్రమే అందుకే ఇది పుణ్యభూమి అయినది.

ప్రసంగాన్ని ఆలకిస్తున్న భక్తులు
ఇక్కడ ధర్మాచార్యులకు నమస్కారిస్తారు కనుక ఇది ధర్మ భూమి అయినది. ఇక్కడ యోగులు పుట్టారు కనుక అందుకు ఇది యోగ భూమి అయినది. ఇక్కడ పుడితే మోక్షం వస్తుంది.
అయితే మన పవిత్ర ధర్మం ప్రస్తుతం కష్టాలలో ఉంది. ఎలా అంటే…
తల్లికి ఒక రోజు (mother day) తండ్రికి ఒక రోజు (father’s Day) అని మనం జరుపుకుంటున్నాము కానీ ఇది మన సంస్కృతి కాదు .
తల్లిదండ్రులను నిత్యము పూజ చేయడం నేర్చుకోవాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కేవలం ఒకరోజు ఏంటీ ప్రతి రోజూ మనం మన తల్లి తండ్రులను పూజించుకుందాం. చిన్న కథలో ఒక కొడుకు వాళ్ళ అమ్మ ను వృద్ధాశ్రమం లో చేర్చాడు. అమ్మ ఆఖరి దశలో ఉన్నప్పుడు కొడుకు వెళ్లి తులసి నీరుబోస్తూ అమ్మా నీ కోరిక ఉంటే చెప్పు అని అడిగితే అమ్మ చెప్తుంది…. “కొడకా ఆశ్రమంలో ఫాన్స్ లేవు వేయించు” అని. అప్పుడు కొడుకు “ఎందుకమ్మా ఆఖరి దశలో అడుగుతున్నావ్? పదిహేను సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా? అప్పుడే అడిగుంటే వేయించి ఉండేవాడిని కదా? అన్నాడు. “నాయనా నేనైతే ఈ ఎలాగో భరించాను. రేపు నువ్వు ఇక్కడికి వచ్చాక ఈ ఉక్కపోతను భరించలేవు కన్నా” అన్నది. ఇది తల్లి ప్రేమకు పట్టం కట్టే సంస్కృతి .ఇది నా భారతదేశం.

భక్తులకు సూచనలిస్తున్న నిర్వాహకులు, భక్తజన సందోహం
Friendship Day అని ఒక రోజు చేసుకుంటున్నాము కానీ మనదేశంలో స్నేహం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. అంత సమయం లేకుంటే శ్రీకృష్ణుడు లేదా కుచేలుడి జన్మదినాలలో ఒక రోజును స్నేహితుల దినోత్సవంగా కేటాయించుకుందాం.
అమెరికా లాంటి దేశాల్లో లాగా తల్లికి కొంతమంది పిల్లలు తండ్రికి కొంతమంది పిల్లలు మన దేశంలో ఉండదు. బతికున్నంత కాలం ఒకే భార్య, ఓకే భర్త. “రామో విగ్రహవాన్ ధర్మః” అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, వదినను గౌరవించడం ఎలాగో రాముడిని చూసి నేర్చుకోవాలి.
శివుని పరివారమైన నంది, నెమలి, సింహము, పాము నిజానికి ఒకదానికొకటి శత్రువులు. అయినప్పటికీ కలిసే ఉంటాయి. అలాగే మనం కూడా అందరం కలిసి ఉండాలి. కుల వివక్షను చూపడం మానుకోవాలి.
రాముడు నడయాడిన దేశం భారత దేశం అలాంటి దేశం లో కుట్రలు, కుతంత్రాలకు చోటు ఇవ్వకూడదు. మనం శివ పూజ, రామ జపం తోపాటు రాముడిలోని రామ తత్వాన్ని లక్ష్మణుడిలోని లక్ష్మణ తత్వాన్ని చూసి ఆచరించినపుడే దేశం పరమ వైభవ స్థితికి చేరుతుంది.
ఈ కార్యక్రమంలో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషం. అంతటి కోలాహలంలోనూ శ్రీ బయ్యా వాసు ప్రసంగాన్ని భక్తులందరూ మంత్ర ముగ్ధులై విన్నారు.





