News

దేవాలయాలకు రక్షణ కోరుతూ అధికారులకు వినతి

1kviews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్రగుంటలోని బిలకూటక్షేత్రములో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ రధాన్ని కొందరు దుండగులు 13.02.2020 అర్ధరాత్రి సమయంలో తగలపెట్టగా రధం పూర్తిగా ద్వoసమయిన విషయం మనకందరికీ తెలిసినదే.

ఈ ఘటనపై కలత చెందిన కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి, శ్రీ పసుపులేటి శివశంకర్, మాజీ సైనికుడు శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి, బిజెపి యువమోర్చా కన్వీనర్ మల్లం కొండారెడ్డి, మూలా బాలకృష్ణా రెడ్డి, రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు బిట్రగుంటలో జరిగిన ఘటన ప్రమాద వశాత్తు జరిగినది కాదని, అన్య మతస్థులు కొందరు ఉద్దేశ్యపూర్వకంగా చేసినదేనని అభిప్రాయపడ్డారు. కనుక జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధ్యులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కి, మండల తహశీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.

వినతి పత్రంలోని అంశం యదాతథంగా మన VSK పాఠకుల కోసం….

తేదీ: 18.02.2020

మంగళవారము,

వింజమూరు.

శ్రీయుతులు వింజమూరు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి దివ్య సముఖమునకు

ఆర్యా,

విషయము:మండల పరిధిలో గల అన్నీ హిందూ దేవాలయాల పరిరక్షణ మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్రగుంట లోని బిలకూటక్షేత్రములో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ రథమును తగలపెట్టిన విషయములో దుండగులను గుర్తించి కఠినముగా శిక్షించాలి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్రగుంటలోని బిలకూటక్షేత్రములో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ రధాన్ని కొందరు దుండగులు 13.02.2020 అర్ధరాత్రి సమయంలో తగలపెట్టగా రధం పూర్తిగా ద్వoసమయ్యింది. ఈ చర్య వల్ల ఎంతో అరుదైన కలపతో ప్రతిష్టాత్మకంగా ఉన్న స్వామి వారి రథం దగ్దమవటమే కాకుండా కోటి రూపాయల వరకు నష్టం జరిగి హిందూ సమాజం యెక్క మనోభావాలను, సంస్కృతి సంప్రదాయాలను అవమానపరచటమే…

ఈ దుశ్చర్యను మతిస్థిమితం లేని వ్యక్తి చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవం వేరేగా ఉంది. రథం పైభాగం నుండి కాలుతూ కింది భాగమునకు మంటలు వేగంగా వ్యాపించాయి. రధాన్ని ఉంచిన విశాలమైన, మైదానం వంటి ప్రదేశంలో ఆ విధముగా జరిగేందుకు ఎటువంటి ఆస్కారమూ లేదు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు దగ్గరపడుతున్న ఈ సమయములో కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం పెట్రోలు వంటి బాగా వేగముగా మండగలిగే సామర్ధ్యము గల ఇంధనాన్ని రథం పైబాగం నుండి వినియోగించినట్లు స్పష్టముగా అర్ధమవుతుంది. రధ పరిమాణాన్ని బట్టి కనీసం 30 నుంచి 40 లీటర్ల మేర పెట్రోలు వినియోగించి ఉండాలి, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఇంత ఇంధనాన్ని ఉపయోగించి నిప్పంటించి సురక్షితంగా తప్పించుకోవటం అసాధారణం.

గతంలో ఇలాగే పిఠాపురంలో దేవతామూర్తుల విగ్రహాల విధ్వంసం, 14.02.2020నాడు పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావు పాళెము గ్రామదేవతల ముఖద్వారం కూల్చివేత ఇలా వరుసగా జరుగుతున్న అన్నింటినీ చేస్తున్నది మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నారని అధికారులు చెప్పటం చాలా బాధాకరం. వీటన్నింటి వెనుక వ్యవస్తీకృతమైన హిందూ వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయని అర్థం అవుతుంది.

మన పరిసర ప్రాంతాలలో ఎంతో ప్రాశస్త్యం గల నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారు, నల్లగొండ్ల శ్రీ లక్శ్మీ నరసింహ స్వామి వారు, త్వరలో  బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతోన్న వింజమూరు నందు గల శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం మన జిల్లాలోనే గాక రాష్ట్ర స్థాయిలోనే ఎంతో ప్రసిద్ధి చెందినవి. గత కొన్ని రోజులుగా జరగుతున్న పరిణామాలను చూసి యావత్తు హిందూ సమాజం భయాందోళనలకు గురి అవుతున్న పరిస్థితుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి దేవాలయాల విష్టతను, మా సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని, ఈ సమస్యను అత్యవసర పరిస్థితిగా భావించి ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్లి ఇటువంటి దుశ్చర్యలు మరలా మరలా పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవలంభించాలని కోరుకుంటున్నాము.

ఇట్లు

భవదీయులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.