
ఢిల్లీలో జరుగుతోన్న ఏఐ సమిట్‌లో కృష్ణార్జునుల హైటెక్ డిజిటల్ రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిలయన్స్‌కు చెందిన జియో ఇంటెలిజెన్స్ విభాగం అత్యాధునిక హోలోగ్రామ్ టెక్నాలజీ, కృత్రిమ మేధను ఉపయోగించి భారతీయ ఇతిహాసాలకు సంబంధించిన ఈ చిత్రాలను రూపొందించింది. ‘మహాభారత్: ఏక్ ధర్మ్ యుద్ధ్’ సిరీస్‌లోని పలు పాత్రల డిజిటల్ రూపాలను ఈ సదస్సులోని తమ స్టాల్‌లో ప్రదర్శించింది. కృష్ణుడు, అర్జునుడు, ఇతరుల రూపాలతో సందర్శకులు మాట్లాడేలా ఏర్పాట్లు చేసింది.
సందర్శకులు అడిగిన పలు ప్రశ్నలకు కృష్ణుడు, అర్జునుడి డిజిటల్ రూపాలు సమాధానం ఇస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, మన ఇతిహాసాలపై యువతకు ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఏఐ ప్రాజెక్టును రూపొందించినట్లు జియో ఇంటెలిజెన్స్ స్టాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ‘మహాభారత్: ఏక్ ధర్మ్ యుద్ధ్’ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉందన్నారు.





