ArticlesNews

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యులు దేశభక్త కొండా వెంకటప్పయ్య

172views

( ఫిబ్రవరి 22 – కొండా వెంకటప్పయ్య జయంతి )

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యులు శ్రీ కొండా వెంకటప్పయ్య గారు. గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందిన కొండా వెంకటప్పయ్య స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్త బిరుదాంకితులు. సహాయనిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివారు.

కొండా వెంకటప్పయ్య గారు 1866, ఫిబ్రవరి 22న పాత గుంటూరులో జన్మించారు. తల్లి పేరు బుచ్చమ్మ, తండ్రి పేరు కోటయ్య. వెంకటప్పయ్యగారి ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగింది. తరువాత బీఏ, బీఎల్ మద్రాసులో చేశారు. చదువు పూర్తయ్యాక బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. బాల్యం నుంచే దేశభక్తి, ప్రజా సేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడు రూపాయలను తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవారు.

ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతన్‍కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పదివేల రూపాయల విరాళం ప్రకటించారు.1910లో బందరులో జాతీయ కళాశాల ఈయన చేతుల మీదుగానే ప్రారంభమైంది.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించిన వ్యక్తి కొండా వెంకటపయ్య. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ – చమ్స్‍ఫర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసుకు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యులు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించారు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు.

గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవారు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది. 1933లో మహాత్ముడు ఆంధ్రలో హరిజన యాత్ర సాగించాడు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు. ఆంధ్రదేశంలో 65 వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నుదై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు.

1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం లోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య కడలూరు జైలులో ఉన్నప్పుడు “డచ్ రిపబ్లిక్” అనే గ్రంథాన్ని రచించారు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. “శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి” అన్న భక్తి రసభరితమైన శతకాన్ని,ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే పుస్తకం రచించారు.

ఆంధ్ర రాజకీయాలలో అతని స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి కొండా వెంకటప్పయ్య 1949 ఆగష్టు 15 న దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ మరణించారు. తెలుగువారందరూ సదా స్మరించుకోవాల్సిన నిరాడంబర సేవామూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య.