
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్, ఇప్పుడు గొప్ప సంస్కృతి, ప్రగతి, ఆత్మ విశ్వాసానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన ‘బస్తర్ పండుమ్’పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో బస్తర్ ప్రాంతపు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘గతంలో బస్తర్ అనగానే మావోయిజం, హింస, వెనుకబాటుతనం గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు బస్తర్ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. స్థానిక ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. ఈ ప్రాంతం భవిష్యత్తులోనూ శాంతి, ప్రగతి, సాంస్కృతిక గౌరవంతో నిండి ఉండాలని నేను ఆశిస్తున్నాను’ అని ‘ఎక్స్’ వేదికగా మోదీ పోస్టు పెట్టారు. ఈ నెల 7న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ ఉత్సవం, గిరిజనులు హస్తకళలు, స్థానిక వంటకాలు, సంప్రదాయ గిరిజన నృత్యాలు, జానపద గీతాలతో బస్తర్ వైభవాన్ని చాటి చెప్పింది.





