
రాజస్తాన్ అజ్మీర్ లోని క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పేరు విషయంలో అత్యంత కీలక మార్పు జరిగింది. స్థానిక ప్రజల డిమాండ్లు, ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ పేరును ‘‘కృష్ణ గంజ్ పోలీస్ స్టేషన్, కృష్ణగంజ్ పోలీస్ చౌకీ’’ గా మార్చారు. తమ నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరునే పెట్టాలని స్థానికులు ముక్తకంఠంతో పదే పదే డిమాండ్లు చేశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని అధికారులకు సూచనలు చేయడంతో, ఈ పేరును మార్చేశారు అధికారులు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేవ్నాని, ఇన్స్పెక్టర్ జనరల్ దీపక్ కుమార్ సహా పోలీసు శాఖతో సంప్రదించి, పేరు మార్పును అమలు చేయడానికి అవసరమైన చర్యలను ఆదేశించిన తర్వాత హోం శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పటి నుంచి పోలీసు రికార్డుల్లో, సైన్ బోర్డులు, ప్రభుత్వ పత్రాల్లో, అన్ని అధికారిక సమాచారాలలో కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్, కృష్ణగంజ్ పోలీస్ చౌకీగానే పేర్కొంటారు.
ఈ పేరు మార్పు ఈ ప్రాంతంలో సనాతన సంస్కృతిని పరిరక్షించే దిశగా ఒక అడుగు అని అసెంబ్లీ స్పీకర్ దేవ్నాని నొక్కి చెప్పారు. “కృష్ణ అనే పేరు భారతీయ సనాతన సంస్కృతి, విశ్వాసం, ప్రేమ, నీతి మరియు జాతి ఆత్మను సూచిస్తుందని, అలాగే ఈ ప్రాంతం బలమైన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. తాము ప్రజల మనోభావాలను పూర్తిగా గౌరవిస్తున్నామని తెలిపారు.





