
దేశబాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి తియ్యనైనా అమ్మభాషకు గుర్తింపు తెచ్చిన తొలి తెలుగు శాసనం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో ఉంది. భాష ఉనికి చాటే తొలి తెలుగుశాసనం నిర్లక్ష్యానికి గురవుతోంది. తెలుగుభాష వారసత్వ కీర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
చరిత్ర ఇలా..
కలమల్లలో చెన్నకేశవస్వామి ఆలయంలో తొలి తెలుగుశాసనాన్ని గుర్తించారు. క్రీ.శ 575లో ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు ఈ శాసనాన్ని వేయించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ శాసనం గొప్పతనం తెలియని కలమల్ల గ్రామస్థులు దీనిని ఒక బండరాయిగా భావించి కత్తులు, గొడ్డలి పదును చేసేందుకే ఉపయోగించేవారు. ఈ క్రమంలో 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తు గల ఈ శాసనం ప్రస్తుతం 4 అడుగులే మిగిలింది. తొలి తెలుగుశాసనం బ్రాహ్మి లిపి నుంచి నేటి తెలుగు భాష పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది.
వెలుగులోకి వచ్చిందిలా..
మొదటగా 1904 సంవత్సరంలో మద్రాస్ శాసన పరిశోధన విభాగం వారు ఈ శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా గుర్తించినప్పటికీ ఆనవాళ్లు కనుగొనలేదు. తర్వాత 1947-48 సంవత్సరంలో ఆచార్య కె.నీలకంఠశాస్త్రి, ఎం.వెంకటరామయ్య ఈ శాసనాన్ని ప్రచురించినా ప్రాముఖ్యత లభించలేదు. ఈ క్రమంలో కనుమరుగైన తొలి తెలుగు శాసనాన్ని 2022 జనవరిలో కలమల్ల చెన్నకేశవ స్వామి ఆలయంలో గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు కట్టించిన 101 దేవాలయాలు, శాసనాలు అభివృద్ధి పథంలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్మించిన తొలి తెలుగు శాసనం, దేవాలయం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. అధికారులు చొరవ చూపి పరిరక్షించకపోతే భవిష్యత్తు తరాలకు అవశేషంగా మిగిలిన బండరాయినే చూపించాల్సిన దుస్థితి నెలకొంది.





