News

ఉత్తరాఖండ్ సర్కార్ సంచలన నిర్ణయం.. ‘మదర్సా బోర్డు’’ రద్దు..

149views

మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది జూలై మాసం నుంచి మదర్సా బోర్డులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి బదులుగా రాష్ట్ర మైనారిటీ విద్యా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. నిజానికి గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే మదర్సా బోర్డును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. జూలై నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.

జూలై నుండి అన్ని మైనారిటీ విద్యా సంస్థలను ఉత్తరాఖండ్ రాష్ట్ర మైనారిటీ విద్యా ప్రాధికార సంస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. వాటి గుర్తింపు ఉత్తరాఖండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా జరుగుతుంది.
ఇక… సిలబస్ విషయంలోనూ ధామీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మైనారిటీ విద్యార్థుల విద్యా పాఠ్య ప్రణాళికను రూపొందించేందుకు కొందరు ప్రొఫెసర్లను ఎంపిక చేసింది. ఇందులో అన్ని మైనారిటీ వర్గాలకు చెందిన విద్యావేత్తలకు చోటు కల్పించారు.

చైర్మన్ గా డాక్టర్ సుర్జిత్ సింగ్…
మైనారిటీ విద్యా ప్రాధికార సంస్థ చైర్మన్ గా డాక్టర్ సుర్జిత్ సింగ్ గాంధీ నియమితులయ్యారు. అలాగే ప్రొఫెసర్ రాకేష్ జైన్, డాక్టర్ సయ్యద్ అలీ హమీద్, ప్రొఫెసర్ పెమా టెన్జిన్, డాక్టర్ ఎల్బా మెడ్రిల్, ప్రొఫెసర్ రొబినా అమన్ మరియు ప్రొఫెసర్ గుర్మీత్ సింగ్ సభ్యులుగా వుంటారు. అలాగే ఉన్నత విద్య డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (SCERT) డైరెక్టర్ మరియు మైనారిటీ సంక్షేమ డైరెక్టర్ కూడా ఈ అథారిటీలో సభ్యులుగా ఉంటారు.

ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్ లో మైనారిటీ విద్యను కేవలం మదర్సాలు మాత్రమే అందిచేవి. సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీల వంటి ఇతర మైనారిటీ వర్గాలకు సమాన విద్యా హోదా మరియు అవకాశాలు లభించకుండా ఇది అడ్డుకుంటోందని ప్రభుత్వం చెబుతోంది.

అంతేకాకుండా మదర్సాలు చట్ట విరుద్ధ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే అనేక ఉదాహరణలు బట్టబయలయ్యాయి. అలాగే నిబంధనలను ఉల్లంఘించడం, విద్యా నాణ్యత లోపించడం, విదేశీ నిధుల విషయంలో అవకతవకలు లాంటివి జరుగుతూనే వున్నాయి. రాష్ట్రంలోని వందలాది అక్రమ మదర్సాలపై చర్యలు తీసుకున్న తర్వాత, అన్ని మైనారిటీ సంస్థల కోసం ఏకరీతి నియమాలను రూపొందించాలని, ఒకే చట్రంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జవాబుదారీని తీసుకురావాలని కూడా నిర్ణయించింది.