News

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే మంత్రి…

137views

తమిళనాడులో అధికారంలో వున్న డీఎంకే పార్టీ పనిగట్టుకొని మనుషుల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు డీఎంకే నేతలు, మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలకు దిగుతున్నారు. తాజాగా తమిళనాడు వ్యవసాయ మంత్రి పన్నీర్ సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు హిందీ మాత్రమే తెలుసని అన్నారు. అందుకే వారు పానీపూరీ అమ్మేందుకు తమిళనాడుకు వస్తారని వ్యాఖ్యానించారు.

‘ఉత్తరాది నుంచి వచ్చిన వారు టేబుళ్లు శుభ్రం చేయడానికి తమిళనాడు వస్తున్నారు. వారు కేవలం హిందీ మాత్రమే నేర్చుకున్నందున నిర్మాణ కార్మికులుగా, పానీపూరీ అమ్మేవారిగా ఇక్కడికి వస్తున్నారు. కానీ మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే మనం రెండు భాషల విధానాన్ని అనుసరిస్తున్నాం. దీంతో తమిళం, ఆంగ్లంపై మన వారు దృష్టి సారిస్తున్నారు. వారు విదేశాలకు వెళ్లి అమెరికా, లండన్‌లో కోట్లలో సంపాదించే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు’ అని అన్నారు.

గతంలో డీఎంకే మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూడండి…

తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ ఓ సభలో మాట్లాడిన మాటలు తెగ దుమారం రేపాయి. తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళలు అనేక మంది భర్తలను కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని పేర్కొన్నారు. తమిళ ఆచారాల లాగా కాకుండా.. ఉత్తర భారతదేశ సంప్రదాయాలు బహుభార్యత్వం, బహు భర్తృత్వం కలిగి ఉంటాయని దురై మురుగన్ చెప్పారు. ఈ క్రమంలోనే తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పరోక్షంగా మహాభారతాన్ని ప్రస్తావించిన దురై మురుగన్.. ఉత్తర భారత సంస్కృతి ఒక స్త్రీ 5 లేదా 10 మంది పురుషులను పెళ్లి చేసుకునేందుకు అనుమతిస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడని.. కానీ ఉత్తర భారతదేశంలో ఒక స్త్రీ అనేకమంది పురుషుల్ని వివాహం చేసుకోవచ్చని మంత్రి దురై మురుగన్ తెలిపారు. అలాగే ఐదుగురు పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చని.. ఇది వారి సంస్కృతి, ఒకరు వెళ్తే మరొకరు వస్తారని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి.
==============================================

2. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కూడా కొన్ని రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త‌మిళ‌నాడు మ‌హిళ‌ల‌తో ఉత్త‌రాది మ‌హిళ‌ల‌ను పోల్చుతూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో అమ్మాయిల‌ను చ‌దువుకోవాల‌ని చెబుతామ‌ని, కానీ ఉత్త‌ర భార‌తంలో మ‌హిళ‌ల‌ను వంట‌గ‌దికే ప‌రిమితం చేస్తార‌ని, పిల్ల‌ల్ని క‌న‌మంటార‌ని మార‌న్ అన్నారు. ఖైద్ ఏ మిల్ల‌త్ ప్ర‌భుత్వ మ‌హిళా కాలేజీ ఈవెంట్‌లో పాల్గొని ఆయ‌న మాట్లాడారు.

మ‌న అమ్మాయిలు ల్యాప్‌టాప్ ప‌ట్టుకుని చాలా గ‌ర్వంగా ఫీల‌వుతార‌ని, ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌వుతార‌ని, పీజీ చ‌దువుకుంటార‌న్నారు. చ‌దువుకోవాల‌ని ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల త‌మిళ‌నాడు అమ్మాయిలు కాన్ఫిడెంట్‌గా క‌నిపిస్తార‌ని, కానీ ఉత్త‌రాదిలో ఏం చేస్తారో తెలుసా, అమ్మాయిలు ఉద్యోగం చేయ‌వ‌ద్దు అంటార‌ని, ఇంట్లోనే ఉండాల‌ని చెబుతార‌ని, కిచెన్‌లో ఉండాల‌ని లేదా పిల్ల‌లు క‌నాల‌ని ఆదేశిస్తార‌ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
============================

3. తమిళనాడు అటవీ శాఖ మంత్రి పొన్ముడి కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంప్రదాయాలను, విశ్వాసాలను ఘోరంగా అవమానించారు. హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టారు. ‘మహిళలు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డ బొట్టు (శైవమతానికి సంబంధించినది) లేదా నామం (వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం) అతడు ధరిస్తాడా అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే ‘పడుకునే’ పొజిషన్‌, వైష్ణవుడు అయితే ‘లేచి నిలబడే’ పొజిషన్‌ ఉంటుందని ఆమె వివరించింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.