News

‘‘హిందూ వ్యతిరేకత’’ విధానాన్నే కొనసాగిస్తున్న కాంగ్రెస్..

164views

లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా హిందువులపై, హిందూ ధార్మిక సంస్థలపై ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు గానీ, కించపరిచే వ్యాఖ్యలు గానీ చేస్తూనే వుంటుంది. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మరో అభ్యంతరకరమైన పని చేసింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్.. కొండగట్టు దేవాలయ అభివృద్ధి కోసం మంజూరు చేసిన 35.19 కోట్లను ఉపసంహరించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డిమాండ్ చేశారు.

టీటీడీ ఈ కేటాయింపులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. టీటీడీ కేటాయించిన నిధులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారిక అభ్యర్థన మేరకే కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 35.19 కోట్లను మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ముందు కూడా ఉంచామని, ఆ తర్వాత బోర్డు నిధులను మంజూరు చేసిందని చైర్మన్ పేర్కొన్నారు.

అయితే.. ఈ ప్రాజెక్టులో భాగంగా భక్తుల సౌకర్యార్థం 96 గదులతో కూడిన గెస్ట్ హౌజ్, ఇతర మౌలిక సదుపాయాలు వున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఈ నెల 3 న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ తో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి, మద్దతు ఇచ్చినందుకు టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

అయితే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. ఇలాంటి పనే చేసింది. టీటీడీ నిధులతో నడిచే ధార్మికపరమైన ప్రాజెక్టులపై వ్యతిరేక వైఖరే అవలంబించింది. రాష్ట్రవ్యాప్తంగా SC మరియు ST కాలనీలలో సుమారు 5,000 దేవాలయాలను నిర్మించాలనే TTD ప్రతిపాదనను AP కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల వ్యతిరేకించారు, ఈ ప్రణాళికను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఏడు కొండల విషయంలోనూ అప్పటి సీఎం, వైఎస్ షర్మిల తండ్రి వైఎస్సార్ కూడా ఏడు కొండల ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. దీనిపై అప్పట్లో హిందువులు పెద్ద ఉద్యమాన్నే లేవదీశారు.

ఇక.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడ వైస్. జగన్ హయాంలోనూ టీటీడీ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయని, దారి మళ్లించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూను కల్తీ చేశారన్న ఆరోపణలూ ముంచాయి.మొత్తం మీద చూస్తే, ఈ చర్యలు టిటిడిని కించపరచడానికి లేదా దాని ధార్మిక కార్యకలాపాలను అడ్డుకోవడానికి రూపొందించబడినట్లు కనిపిస్తున్నాయి.

ఇంతకు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో భక్తులకు అర్థం కావడం లేదు. టీటీడీ వున్నదే హిందూ ధర్మ ప్రచారం, రక్షణ కోసం. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా టీటీడీ దేవాలయాల నిర్మాణం చేపడుతోంది. అదే కోవలో కొండగట్టు అభివృద్ధికి కేటాయించింది టీటీడీ.

అంతేకాకుండా ఇతర మతాలకు, వారి అభివృద్ధికి, వారి పండుగల సమయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చులు చేస్తాయి. అంతేకాకుండా ముస్లింలకు హజ్ యాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. అలాంటి విషయాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయరు. అదో లౌకికవాదం అన్నట్లు చెబుతుంటారు. మరి ఇప్పుడు కొండగట్టుకు టీటీడీ నిధులు ఇస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లో?