
సంస్కృతి, సాంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న భారత్ స్ఫూర్తిగా తీసుకుని మారిషస్‌ను అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని ఆయన సందర్శించారు. పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడుతూ.. తాను అధ్యాపక వృత్తి నుంచి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు. అతిథులను గౌరవించడంలో భారతీయులు ముందు వరసలో ఉంటారని చెప్పారు. మారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టిటిడి సూచనలతో వేద పాఠశాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. అనంతరం వేద పండితులు మారిషస్ దేశాధ్యక్షుడికి వేదాశీర్వచనం అందజేశారు.





