
ఐఐటీ మద్రాస్ విద్యార్థుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వక్రీకరిస్తూ, డీఎంకే మాజీ ఎంపీ ఎం.ఎం. అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ జాత్యహంకార పూరితంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ఐఐటీ మద్రాస్ ఇటీవల ఒక ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, 2024 బ్యాచ్ నుంచి బీటెక్ విద్యార్థులు కావాలనుకుంటే మూడు సంవత్సరాల తర్వాత తగిన క్రెడిట్స్ సాధించి ‘బీఎస్సీ’ (B.Sc) డిగ్రీతో నిష్క్రమించవచ్చని (Exit Option) ప్రకటించింది. స్టార్టప్స్ లేదా ఇతర రంగాల వైపు వెళ్లాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమని డీన్ ప్రతాప్ హరిదాస్ వివరించారు.
అయితే ఈ సానుకూల నిర్ణయంపై మాజీ ఎంపీ అబ్దుల్లా విషం చిమ్మారు. తమిళంలో బ్రాహ్మణ యాసను ఉపయోగిస్తూ.. “ఐఐటీ మాది.. ఈ మధ్య మీ వాళ్ళు (బ్రాహ్మణులు) ఎక్కువగా వచ్చేస్తున్నారు.. వస్తే బీఎస్సీ డిగ్రీ తీసుకొని పారిపోండి.. అలా కాకుండా బీటెక్ కావాలని ఆశపడితే ఫైనల్ ఇయర్‌లో ఫెయిల్ అవుతారు జాగ్రత్త” అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఐఐటీలను ఒక వర్గానికి వ్యతిరేకంగా చిత్రీకరించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి, చదువు మధ్యలో ఆపేయకుండా ఏదో ఒక డిగ్రీతో బయటకు వచ్చేలా చేసిన ఈ మార్పును.. అబ్దుల్లా కుల కోణంలో చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అబ్దుల్లా వ్యాఖ్యలు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని, విద్యా విధానంలో కుల రాజకీయాలు తీసుకురావడం తగదని విద్యావేత్తలు, నెటిజన్లు హితవు పలుకుతున్నారు.





