
డిసెంబరు 29 నుంచి జనవరి 2 వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజు డిసెంబరు 29న వినాయక స్వామివారు, చంద్రశేఖర్ స్వామి పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారని చెప్పారు. నవంబరు 30న వళ్ళి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి9 చుట్లు, డిసెంబరు 31న సోమస్కందస్వామి 9 చుట్లు, జనవరి 1న కామాక్షి అమ్మ 9 చుట్లు, జనవరి 2న చండికేశ్వరస్వామి, చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఊంజల సేవ, తెప్పోత్సవాల కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.
జనవరి 3న ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నటరాజస్వామి, శివగామి అమ్మ, మాణిక్యవాసగ స్వామి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నట్లు స్పష్టం చేశారు. తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.





