News

బురఖా ధరించలేదని భార్య, కుమార్తెలని కాల్చేసి, సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చివేత

179views
యూపీలోని షామ్లి జిల్లాలో ఘోరం జరిగింది. బురఖా ధరించకుండా వచ్చినందుకు ఫరూక్ అనే వ్యక్తి భార్య తాహిరాను, ఇద్దరు కుమార్తెలను చంపేసి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, పిల్లలు కనిపించకుండా పోయారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫరూఖ్ ను విచారించగా అసలు విషయం బట్టబయలైంది. బురఖా ధరించనందుకు తానే వారందర్నీ చంపేశానని అంగీకరించాడు.
బురఖా ధరించనందుకు తన భార్యను గన్ తో కాల్చి చంపగా, ఈ విషయం బయటకు పొక్కకుండా వుండేందుకు తన పెద్ద కుమార్తెను కూడా కాల్చి చంపాడు. ఈ శబ్దాలు విని, బయటికి వచ్చిన చిన్న కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఈ ముగ్గురి శవాలను సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతిలోనే పాతి పెట్టాడు. ఈ విషయం అంతా పోలీసుల విచారణలో తేలింది.
నిజానికి ఈ ముగ్గురూ పది రోజులుగా కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబీకులు, బంధువులు ఫరూక్ ను నిలదీయగా, పొంతన లేని సమాధానం ఇచ్చాడు. దీంతో ఫరూక్ తండ్రికి అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారించగా.. మొదట పోలీసులను కూడా తప్పుదారి పట్టించాడు. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించి, శవాలను ఎక్కడ పూడ్చిపెట్టాడో వెల్లడించాడు.
బయటికి వెళ్లే సమయంలో బురఖా ధరించాలని తాను వారికి చెప్పానని, అయినా దీనిని పెడచెవిన పెట్టడంతో పట్టలేని కోపం వచ్చి, ఇలా చేశానని ఫరూక్ పోలీసులకు తెలిపాడు. అయితే కైరానా నుంచి అక్రమంగా తయారు చేసిన తుపాకీని, కార్ట్రిడ్జిలను కొనుగోలు చేశానని తెలిపాడు.చివరికి పోలీసులు సెప్టిక్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితుడు ఫరూక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.